ముదురుతున్న మాన్సాస్ ట్రస్ట్ లొల్లి
By సుభాష్
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఇంతలో తగ్గేలా కనిపించడం లేదు. సింహచలం దేవస్థానం ఆస్తులతోపాటు విలువైన భూములను ఒట్టేయడానికి ప్రభుత్వం పక్కా ప్లాన్ వేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. సంచయితను ట్రస్ట్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా తప్పించాలంటూ విజయనగరంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. కాగా, టీడీపీ నేతలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సంచయిత తెలిపారు.
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభతువం తీరు సరైంది కాదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నిన్న సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సింహాచలం దేవస్థానం పరిధిలో 105 ఆలయాలు, విలువైన భూములున్నాయని, ఈ భూములపై కొందరు కన్నేశారని ఆరోపించారు. దాతలు ఇచ్చిన భూముల ఆలయానికే చెందాలని స్పష్టం చేశారు. ట్రస్టుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ట్రస్ట్ చైర్మన్‌గా వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయన్నారు. పిల్లలకు భవిష్యత్‌ను ఇవ్వడానికే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. కాగా, సంచయిత ఆధార్ కార్డును పరిశీలిస్తే ఆమె ఎక్కడ నివసిస్తున్నారో అందరికీ తెలుస్తోందని అన్నారు.
నా మీద, నా కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయడం బాధాకరం
నా మీద, నా కుటుంబ సభ్యుల మీద రోపణలు చేయడం బాధాకరమని సంచయిత అన్నారు. ఒక మహిళ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా ఎన్నికైతే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఏ ఆశయం కోసం తన తాతగారు మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారో ఆ ఆశయ సాధనకు పని చేస్తానని అన్నారు. ట్రస్ట్ భూములు ఎవరికి చెందిని కావని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించారని, అప్పుడు మాట్లాడని వాళ్లు ఇప్పుడెందుకు అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నారని సంచయిత ప్రశ్నించారు.
మాన్సాస్ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై వైసీపీ కన్నెసిందని, సింహాచలం భూములను లాక్కోవడానికే ఈ ప్లాన్ అని ఆరోపించారు. వారసత్వంగా వస్తున్న ఆస్తులపై సర్కార్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. కాగా, ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఇతర మతానికి చెందిన సంచయితకు ఆలయ బాధ్యతలు అప్పగించారంటూ విపక్షాలు సైతం ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి.