పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ లో రెండు రోజుల కిందట గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌ పై కొందరు రాళ్లరువ్వుతూ దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దాడికి నిరసనగా హైదరాబాద్‌లోని అమీర్‌ పేటలో దాదాపు 500 మంది సిక్కులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గురుద్వారాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. గురునానక్‌ దేవ్‌ జన్మించిన పవిత్రస్థలం నాన్‌కానా సాహిబ్‌లో సిక్కులపై దాడులు జరుగుతున్నాయని, సిక్కుల భద్రత,సంక్షేమం కోసం పాకిస్తాన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అసలేం జరిగిందంటే.. సిక్కు యువతి జగ్జీత్‌ కౌర్‌ ను మహ్మద్‌ హుస్సేన్ అనే యువకుడు కిడ్నాప్‌ చేసి, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడుతూ వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఒక దశలో కొందరు గురుద్వారా వద్దకు చేరుకుని రాళ్లు విసిరారు. ఈ ఘటర్షణ వల్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాగా, జగ్జీత్ కౌర్ తనకు తానుగా మతం మార్చుకునే తన వెంట వచ్చిందని, ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు హుస్సేన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.