పాక్‌లో సిక్కు యువ‌కుడి దారుణ హ‌త్య‌

By సుభాష్  Published on  5 Jan 2020 3:14 PM GMT
పాక్‌లో సిక్కు యువ‌కుడి దారుణ హ‌త్య‌

పాక్‌ లో నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడి మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. పెషావర్ లో భారత సంతతికి చెందిన సిక్కు యువకుడు పర్వీందర్ సింగ్ (29)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు కొన్ని రోజులుగా మలేషియాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా, తన పెళ్లి ఉండటంతో వ్యాపార పనుల నిమిత్తం పాకిస్తాన్‌కు వచ్చాడు. పెళ్లికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు తన సోదరుడు హర్మీత్‌ సింగ్‌తో కలిసి వెళ్లిన అతనిపై గుర్తు తెలియని దుండగులు గన్‌తో కాల్చి చంపారు. దీంతో రెండు బుల్లెట్లు పర్వీందర్‌సింగ్‌ శరీరంలోంచి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

గన్‌తో కాల్పులు జరపడంతో అక్కడున్న వారు భయాందోళనతో పరుగులు పెట్టారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా జీవనం కొనసాగిస్తున్న హిందులకు సరైన భద్రత లేదని ఆయన సోదరుడు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటాని పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై భారత్‌ తీవ్రస్థాయిలోధ్వజమెత్తింది. దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఇతర దేశాలకు హితబోధ చేసేముందు, వారి దేశంలో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై చర్యలు తీసుకోవాలని భారత్, పాక్‌కు సూచించింది.

Next Story