ఎరక్క పోయి పెట్టాడు.. ఇరుక్కు పోయాడు..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 3:04 AM GMT
ఎరక్క పోయి పెట్టాడు.. ఇరుక్కు పోయాడు..!

ఒక ఫేక్ వీడియోను ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయిపోయారు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీటర్ లో పెట్టి నెటిజన్లకు దొరికిపోయారు. భారత్‌పై తన ద్వేషాన్ని మరోసారి వెళ్లగక్కే ప్రయత్నం చేశారు ఇమ్రాన్ ఖాన్.. ఓ తప్పుడు పోస్ట్ పెట్టి నవ్వులపాలయ్యారు. ప్రపంచం ముందు భారత్‌ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారత్‌లో జరగుతున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని.. అక్కడి పోలీసులు ఎలా అణగదొక్కుతున్నారో చూడండి, ఆందోళనకారులను పోలీసులు ఎంత దారుణంగా హింసిస్తున్నారో చూడండి అంటూ మూడు వీడియోలు కూడా పెట్టారు. ఇదంతా భారత్‌లోని యూపీలో జరుగుతున్న సంఘటనలు అని పేర్కొన్నారు.

ఈ వీడియోల్లో ముస్లింలను పోలీసులు చితకబాదుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి ఈ వీడియోలు ఇండియాకు సంబంధించినవి కావు. అవన్నీ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు చెందినవి. 2013 మే నెలలో ఢాకాలో.. ఆందోళనకారులపై బంగ్లాదేశ్‌కు చెందిన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ లాఠీఛార్జ్ చేసినవి. అయితే వీటిని నిర్ధారించుకోకుండానే ఇమ్రాన్ ఖాన్.. యూపీకి చెందినవంటూ పోస్ట్ చేశారు. అయితే వీడియోలు పెట్టిన కొద్ది గంటలకు కానీ తాను చేసిన పొరపాటు ఏమిటో ఇమ్రాన్‌కు తెలియలేదు. ఇంతలోగా నెటిజన్లు ఇమ్రాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. ఓ ఆట ఆడుకున్నారు. చివరకు ఇమ్రాన్ ఖాన్ తాను చేసిన ఆ ట్వీట్‌తో పాటు జత చేసిన ఫేక్ వీడియోలను కూడా డిలీట్ చేశారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందించారు. ‘నకిలీ వార్తలను ట్వీట్‌ చేయండి.. దొరికిపోండి.. ఆ ట్వీట్‌లను డిలీట్‌ చేయండి.. మళ్లీ రిపీట్‌ చేయండి’ అని రవీశ్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.



Next Story