కరోనాతో మాదాపూర్ ఎస్సై మృతి
By సుభాష్ Published on 18 Sep 2020 8:08 AM GMTదేశంలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తెలంగాణలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి వైద్యులు, పోలీసులు మరణిస్తున్నారు. తాజాగా కరోనా సోకి మాదాపూర్ ఎస్సై అబ్బాస్ అలీ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న అలీకి ఇటీవల కరోనా సోకింది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్ర పోలీసు శాఖ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.
ఇలా కరోనా మహమ్మారి వల్ల పోలీసు శాఖలు పలువురు మరణించారు. కాగా, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాగాగా 24 గంటల్లో కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,67,046 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1016 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి 1,802 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం 1,35,357 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.60 శాతం ఉండగా, అదే దేశంలో 1.61 శాతం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసులు 30,673 ఉండగా, హోమ్ క్వారంటైన్‌లో 24,081 మంది ఉన్నారు.
ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు.. జీహెచ్‌ఎంసీలో 314, కరీంనగర్ 114, మేడ్చల్ మల్కాజిగిరి 144, నల్గొండ 131, రంగారెడ్డి 174, సిద్దిపేట 121, వరంగల్ అర్బన్ 108 నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో వందలోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.