తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం: రోజూ 40 శ్రామిక్‌ రైళ్లు

By సుభాష్  Published on  5 May 2020 5:42 AM GMT
తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం: రోజూ 40 శ్రామిక్‌ రైళ్లు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లలేక ఎక్కడిక్కక్కడే చిక్కుకుపోయారు. అయితే వారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులను తరలించేందుకు వివిధ రాష్ట్రాలకు వారంపాటు రోజూ 40 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. మంగళవారం నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌ నుంచే కాకుండా వరంగల్‌, రామగుండం, దామరచర్ల, ఖమ్మం నుంచి ఈ రైళ్లు నడపనున్నారు. బీహార్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

వలస కార్మికులను తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సొంత ఖర్చులతో కార్మికులను తరలించాలన్న దానిపై హర్షం వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌, ఘట్‌కేసర్‌ నుంచి 1250 మంది కార్మికులతో ప్రత్యేక రైలు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రామిక్‌ రైలు బయలుదేరింది. మేడ్చల్‌ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్‌ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే మిరప కోతల కోసం మహారాష్ట్ర నంచి కృష్ణా జిల్లాకు వచ్చిన 1200 మంది కూలీలను శ్రామిక్‌ రైలు ద్వారా తిరిగి వారి స్వస్థలాలకు పంపించారు కృష్ణా జిల్లా అధికారులు.

Next Story