కోవిద్ పాజిటివ్ వచ్చిన బాలికను కూడా వదలని నీచులు.. ఇద్దరు అరెస్ట్
By సుభాష్ Published on 24 July 2020 3:05 AM GMTకోవిద్ పాజిటివ్ వచ్చిన బాలికను కూడా వదలని కామాంధులు ఉన్నారు. ఢిల్లీ లోని ఛత్తార్ పూర్ లోని కరోనా కేర్ సెంటర్ లో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారు. కేర్ సెంటర్ లో ఉన్న బాత్ రూమ్ లో మరో కోవిద్ పాజిటివ్ పేషెంట్ వేధించిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. జులై 15న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఆ బాలిక వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు.
అమ్మాయిని వేధించిన 19 సంవత్సరాల వ్యక్తిని, అతడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
10000 బెడ్లు ఉన్న కోవిద్ కేర్ సెంటర్ ను ఛత్తార్ పూర్ ప్రాంతంలో ఇటీవలే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రారంభించారు. కోవిద్ పాజిటివ్ లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటిబిపి) ఈ సెంటర్ బాధ్యతలు తీసుకున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉండలేని వారికి ఇక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు.
మురికి వాడకు చెందిన ఆ బాలిక సెంటర్ లో తన బంధువులతో కలిసి ఉంటోంది. ఇలా తనపై లైంగిక వేధింపులకు దిగారని తన బంధువుతో చెప్పడంతో ఐటిబిపి సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. వారు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.
తనను లైంగికంగా వేధించాడని పోలీసులతో బాలిక చెప్పుకొచ్చింది. అతడితో పాటూ ఉన్న మరో వ్యక్తి మొబైల్ కెమెరాలో బంధించాడని తెలిపింది. అతడి సహచరుడి వయసు కూడా 19 సంవత్సరాలేనని.. ఆ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు దిగలేదని పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్కో చట్టం కింద కూడా కేసునును నమోదు చేసారు. వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకున్న తరువాత బాలికను మరో కోవిద్ కేర్ సెంటర్ కు తరలించారు. నిందితులను కూడా వేరే కోవిద్ కేర్ సెంటర్ కు తరలించి చికిత్స అందించారు. నిందితుల మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.