గాంధీ ఫ్యామిలీ మనసుల్ని దోచిన శివసేన
By సుభాష్ Published on 29 Aug 2020 1:46 AM GMTకాలం మహా చిత్రమైంది. ఏళ్లకు ఏళ్లు గాంధీ కుటుంబం మీద విరుచుకుపడే ఒక పార్టీ.. దానికి చెందిన మీడియా సంస్థ.. ఇప్పుడు వారికి దన్నుగా నిలవటాన్ని ఏమనాలి? రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు ఉండరనే నానుడి ఎంత నిజమన్నది కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకునే పరిణామాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతాయి. తమను పెద్దగా ఇష్టపడని రాహుల్ ను వెనక్కి లాగేందుకు.. ఆయనలోని స్థైర్యాన్ని దెబ్బ తీయటమే కాదు.. పార్టీలో తమ ఉనికిని గుర్తించకుంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్లు తమ లేఖతో చెప్పకనే చెప్పారు.
నాయకత్వ మార్పుపై అందరూ ఆసక్తిగా ఎదురుచూసే వేళ.. తమ ఉనికి కోసం సీనియర్లు లేఖాస్త్రాన్ని సంధించి యువరాజుతో ముఖాముఖి అన్నట్లుగా తలపడటం చూస్తే.. దశాబ్దాలు గడిచినా కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలహీనతలు మరింత ఎక్కువైనట్లుగా అనిపించక మానదు. ఇదిలా ఉంటే.. రాహుల్ కు దన్నుగా నిలిచేందుకు కొత్త మిత్రుడు సాయంగా నిలవట ఆసక్తికర పరిణామం.
వారసత్వ రాజకీయాల్ని నిందిస్తూ.. సోనియమ్మ విదేశీయతపై బలమైన వాదనలు వినిపించే శివసేన.. ఈ రోజున గాంధీ కుటుంబానికి బాసటగా నిలవటమే కాదు.. రాహుల్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్న విషయాన్ని తమ రాతలతో చెప్పేసింది శివసేన. మహారాష్ట్రలో నడుస్తున్నసంకీర్ణ ప్రభుత్వానికి సాయం చేసిన గాంధీ కుటుంబానికి రుణం తీర్చుకునేలా శివసేన వారి అధికారిక పత్రిక సామ్నాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు ఆ పార్టీకి చెందిన 23 మంది సీనియర్లు రాసిన లేఖను పూర్తిగా తప్పుపట్టింది శివసేన. రాహుల్ నాయకత్వాన్ని అంతం చేసే కుట్రలో భాగంగానే ఆ లేఖ రాశారని పేర్కొంటూ ఆసక్తికర అంశాలతో తన తాజా సంపాదకీయాన్ని రాసింది సామ్నా. ఈ సందర్భంగా సీనియర్లకు కొన్ని ప్రశ్నల్ని సంధించింది. రాహుల్ పై బీజేపీ వరుస విమర్శలు చేసినప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారు? రాహుల్ పార్టీ పగ్గాలు వీడినప్పుడు పార్టీ పునరుద్ధరణకు వీరంతా ఎందుకు ముందుకు రాలేదు? రాహుల్ ను వృద్ధరక్షకులు అంతర్గతంగా దెబ్బ తీశారు. ఈ తరహాలో బీజేపీ కూడా దెబ్బ తీయలేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
నెహ్రు.. గాంధీ కుటుంబం కారణంగా ముఖ్యమంత్రులు.. కేంద్రమంత్రులైన వీరంతా ఇప్పుడు ఆ కుటుంబాన్నే ప్రశ్నించటం ఏమిటని నిలదీసింది. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పెద్ద నేతలంతా తమ పదవుల మీద ప్రేమ తప్పించి..పార్టీ పైన కాదంటూ.. పదవులు దక్కనప్పుడల్లా పార్టీ మారి బీజేపీలోకి జారుకుంటారంది. కాంగ్రెస్ సీనియర్ల విషయంలో ఇప్పటివరకు ఎవరు చేయనంత ఘాటైన వ్యాఖ్యలు చేసి.. ఉతికి ఆరేసింది. రాహుల్ కు తన దన్ను సంపూర్ణంగా ఉంటుందన్న విషయాన్ని శివసేన చెప్పేసింది. చూస్తుంటే.. పార్టీకి చెందిన సీనియర్ నేతల కంటే కూడా.. కొత్త మిత్రుడే అత్యంత విశ్వసనీయమైన వారిగా గాంధీ కుటుంబం భావించేలా సంపాదకీయం ఉందని చెప్పాలి.