క్యాన్సర్ తో పోరాడుతున్న ఏడేళ్ల హైదరాబాదీ పిల్లాడి చివరి కోరిక.. ఆయన్ను కలవడమే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 March 2020 1:16 PM GMT
క్యాన్సర్ తో పోరాడుతున్న ఏడేళ్ల హైదరాబాదీ పిల్లాడి చివరి కోరిక.. ఆయన్ను కలవడమే

ఏడేళ్ల పిల్లాడు.. అతడు కూడా అందరు పిల్లలలాగా ఆనందంగా ఆడుకుంటూ గడిపేస్తూ ఉండాల్సిన సమయంలో క్యాన్సర్ మహమ్మారి సోకింది. క్యాన్సర్ థర్డ్ స్టేజ్.. ఆసుపత్రికి ఎందుకు వెళుతున్నాడో అతడికే తెలీదు. ఇంకెన్నాళ్లు బ్రతుకుతాడో చెప్పలేని పరిస్థితి వైద్యులది. ఆ పిల్లాడి పేరు మొహమ్మద్ అబ్దుల్లా హుస్సేన్. అతడి చివరి కోరిక తీర్చడానికి అతడి తల్లిదండ్రులు దుబాయ్ కు తీసుకొని వెళ్లారు. ఇంతకూ అతడి చివరి కోరిక ఏమిటో తెలుసా..?

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ ను కలవడం. మొహమ్మద్ అబ్దుల్లా హుస్సేన్ ఎన్నాళ్ళ నుండో అల్ ముఖ్తోమ్ ను ఒక ఐడల్ గా భావిస్తూ ఉన్నాడు. అతడికి ఏదైనా కోరిక ఉందంటే ఆయన్ను కలవడమే.. ఈ విషయాన్నే మీడియాలో చెప్పుకొచ్చాడు ఆ ఏడేళ్ల పిల్లాడు. ఈ విషయం ముఖ్తోమ్ దాకా చేరడంతో శనివారం కానీ ఆదివారం కానీ ఆయన్ను కలవనున్నాడు అబ్దుల్లా హుస్సేన్.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టే వీడియోలను ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. హార్స్ రైడింగ్ లో నిష్ణాతుడు. ఆయన చేసే స్కై డైవింగ్, బంగీ జంప్ లాంటి సాహసాలు, జంతువులను కాపాడడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా షేక్ హమ్దాన్ చాలా మంచి వ్యక్తి అనే పేరు ఉంది. ఓ గొప్ప రచయిత అని.. ఈయన చెప్పే కవితలకు ఎంతో గొప్ప పేరుంది. 'ఫజ్జా' అనే కలం పేరుతో కవితలు రాస్తూ ఉంటారు.

ఇంత గొప్ప అంశాలు ఆయనలో దాగుండడం అబ్దుల్లాను ఆకర్షించింది. చనిపోయే లోపు ఆయన్ను కలవాలని అనుకున్నాడు. ఎంతో మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అయినటువంటి షేక్ హమ్దాన్ ను కలవాలని.. ఆయన పెంచుకుంటున్న జంతువులను, స్టైలిష్ ఐకాన్ డ్రెస్ లను చూడాలని తనకు ఉందని అబ్దుల్లా తన కోరికను వెల్లడించాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అని.. ఎందరినో ఆదుకున్నాడని అబ్దుల్లా చెప్పుకొచ్చాడు. ఆయన ఆల్ రౌండర్ అని.. ఏ విషయంలో అయినా నంబర్ 1 అని అందుకే ఆయనంటే తనకు చాలా ఇష్టమని అంటున్నాడు.

అబ్దుల్లా తల్లిదండ్రులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ గురించి తెలుసు.. కానీ అబ్దుల్లా కూడా ఆయన్నే ఆరాధిస్తాడని వాళ్ళు అసలు ఊహించలేదు. యూట్యూబ్ లో షేక్ హమ్దాన్ వీడియోలను చూసిన అబ్దుల్లా తన తల్లిదండ్రులతో ఆయన్ను కలవాలని ఉందని చెప్పాడు. ఎప్పుడు చూసినా ఆయనకు సంబంధించిన వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడట అబ్దుల్లా.

ప్రస్తుతం స్టేజ్-3 క్యాన్సర్ తో బాధపడుతున్న అబ్దుల్లాకు సంబంధించిన వార్తలు మీడియాలో వచ్చాయి.. షేక్ హమ్దాన్ ను ఎలాగైనా కలవాలని అనుకున్న అతని కోరిక అతి త్వరలో తీరబోతోంది. అబ్దుల్లా గురించి తెలుసుకున్న షేక్ హమ్దాన్ ఛారిటీ సంస్థ పిల్లాడి చివరి కోరిక తీర్చడానికి ముందుకు వచ్చింది. ఎక్కువ సమయం కూర్చోడానికి ఇబ్బంది అవుతూ ఉండడంతో అబ్దుల్లా ప్రస్తుతం పాఠశాలకు కూడా వెళ్లలేకపోతున్నాడు.

Next Story