మనకెందుకు రంగుల గొడవ.. మార్చెయ్.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 July 2020 9:13 AM GMTఏపీలో కొనసాగుతున్న రంగుల రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పన్కక్కర్లేదు. గ్రామ సచివాలయం సహా వివిధ ప్రభుత్వ పథకాల్లో వైసీపీ రంగులను జొప్పించడంపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కోర్టుల మెట్లు ఎక్కుతున్నాయి. ఎట్టకేలకు ఈ వివాదానికి శుభం కార్డు పడింది. అయితే, ఇదే తరహా అంశం తెలంగాణలో తెరమీదకు వచ్చింది. అయితే, ఇది ఏపీలో అంతటి భారీ రేంజ్ కాదు. మూత్రశాలలకు గులాబీ రంగులు వేయడం గురించి!
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో మహిళలకు ఇబ్బంది కలుగవద్దనే ఉద్దేశంతో ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులను ప్రవేశపెట్టారు. అయితే,ఈ ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులకు గులాబీ రంగులు వేశారు. ఖమ్మంలోని ఎస్సార్-బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో అందుబాటులో ఉంచిన ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులను బుధవారం రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్‌ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బయో టాయిలెట్ బస్సులు గులాబీ రంగులోనే ఉంటాయని మంత్రి అజయ్ ప్రకటించారు.
ఈ వార్త సహజంగానే పెద్ద ఎత్తున మీడియాలో కవర్ అయింది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. గురువారం ఉదయం రవాణా శాఖ మంత్రి అజయ్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సుల రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్‌ను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్ వీల్స్ గులాబీ రంగులో ఉండకుండా చూడాలని మంత్రిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే బస్సుల రంగులు మార్చాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.