శంషాబాద్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్ !
By తోట వంశీ కుమార్ Published on 19 March 2020 12:16 PM GMT
కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి భారీన పడి 9వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 2లక్షల మంది దీని భారీన పడ్డారు. భారత్‌లోనూ కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తో జనాలు ఇంట్లో నుండి బయటకి రావాలి అంటేనే భయపడిపోతున్నారు. పలు దేశాలు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఈ వైరస్ భయంతో జనాలు ప్రయాణాలకు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ ప్రయాణికులతో కిక్కిరిసిపోయే శంషాబాద్ విమానాశ్రయం గురువారం నిర్మానుష్యంగా మారింది.
విదేశాల నుంచి వస్తున్న వారిని నేరుగా వారి లగేజ్ తో సహా ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్తున్నారు. అక్కడ నెగెటివ్ అని రెండు సార్లు తేలితేనే ఇంటికి పంపుతారు. అలాగే అతన్ని వచ్చే 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండాలని ఆదేశిస్తున్నారు.ఇదిలా ఉండగా.. కరీంనగర్ లో ఏకంగా ఒక్కరోజే ఏడుగురు ఇండొనేషియన్స్ కు కరోనా పాజిటివ్ అని తేలడం తో విమాన ప్రయాణీకులపై మరింత నిఘా అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా శంషాబాద్ విమానాశ్రయం చర్యలు చేపట్టారు.
ఇప్పటికే ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ టెస్ట్ చేసినా కూడా బయటకి వచ్చాక కరోనా పాజిటివ్ అని తేలుతుండటం తో ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మొత్తం పూర్తిగా పోలిసుల చేతుల్లోకి వెళ్ళింది. ఎయిర్ పోర్ట్ లో మనిషి అన్నవాడే కనిపించడం లేదు. విమానాశ్రయానికి వెళ్ళే మార్గాలను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ రూట్స్ లో కేవలం అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.