ఐపీఎల్‌ వాయిదాపై షారుక్‌ ఖాన్‌ ఎమన్నాడంటే..!

By అంజి  Published on  14 March 2020 10:28 AM GMT
ఐపీఎల్‌ వాయిదాపై షారుక్‌ ఖాన్‌ ఎమన్నాడంటే..!

కోల్‌కతా: ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాలకు కరోనా వైరస్‌ పాకింది. మన దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య 83కు చేరింది. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు ఇద్దరూ చనిపోయారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.

భారతదేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌లు నిర్వహించకపోవడమే మంచిదని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సహ వ్యవస్థాపకుడు, బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యాచ్‌లను నిర్వహించకపోవడమే మేలని అన్నారు. శనివారం నాడు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీల యజమానులు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఐపీఎల్‌ పాలకమండలి కూడా సమావేశమయ్యింది. ఈ సమావేశంలో మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారని సమాచారం.



కాగా ట్విటర్‌ వేదికగా పలు అంశాలపై షారుక్‌ ఖాన్‌ స్పందించారు. ఆట ముఖ్యం కాదు.. భద్రత ముఖ్యమని.. ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని.. ఆఫ్‌ ది ఫీల్డ్‌లో అన్ని ఫ్రాంఛైజీల యాజమానులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని షారూక్‌ అన్నారు. ప్రేక్షకులు, ఆటగాళ్లు, మ్యాచ్‌లు ఆడే నగర ప్రజల భద్రతే ముఖ్యమని పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని.. త్వరలోనే మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో బీసీసీఐ, ఫ్రాంచైజీల యాజమానులు ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని ట్విటర్‌లో షారుఖ్‌ పేర్కొన్నాడు.

Next Story