నా పిల్ల‌లు అలా చేస్తున్నార‌ని టీవీ ప‌గ‌ల‌గొట్టాను..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Dec 2019 9:13 PM IST
నా పిల్ల‌లు అలా చేస్తున్నార‌ని టీవీ ప‌గ‌ల‌గొట్టాను..!

పాక్ మాజీ క్రికెట‌ర్ షాహిద్‌ అఫ్రిదీ ఓ ఇంట‌ర్వ్యూలో హిందూ సంప్రదాయాలపై స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొద్ది కాలం క్రితం అఫ్రిదీ ఓ మీడియా చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో విలేఖ‌రి మీరు ఎప్పుడైనా టీవీ పగలగొట్టారా..? అని అఫ్రీదిని ప్రశ్నించింది. బ‌దులుగా అఫ్రిది ప‌గల‌గొట్టాను అని స‌మాధాన‌మిచ్చాడు.

కొన‌సాగింపుగా వివ‌ర‌ణ ఇస్తూ.. నాకు కొన్ని షోలు నచ్చవని, కానీ నా భార్యకు ఆ షోలపై ఆసక్తి ఉండటంతో.. పిల్లలతో కాకుండా ఒంటరిగా చూడమ‌ని చెప్పాన‌ని అన్నాడు. అయితే ఒక‌ రోజు నా పిల్లలు టీవీ ముందు నిల్చోని కార్య‌క్ర‌మంలో ‘హారతి’ ఇస్తున్న విధానాన్ని చూసి ఇమిటేట్ చేయ‌డం చూశాన‌న్నారు. వెంట‌నే ఆగ్ర‌హంతో నా భార్యవైపు కోపంగా చూసి ఆవేశంతో టీవీ పగలగొట్టాన‌ని అన్నాడు. అయితే అఫ్రీది తీరుపై నెటిజన్లు పెద్దఎత్తున విమర్శిస్తున్నారు.

పాక్‌ టీంలో స్పిన్న‌ర్ డానిష్ క‌నేరియా హిందువైన‌ కార‌ణంగా వివక్ష చూపిస్తారని వార్తలు వెలువ‌డిన నేపథ్యంలో అఫ్రీది పాత ఇంట‌ర్వ్యూ వీడియో తిరిగి ప్రాచుర్యం సంతరించుకుంది. షోయబ్‌ అక్తర్‌.. స్పిన్నర్‌ కనేరియా హిందూ కావడం వల్లే అతడిపై వివక్ష చూపార‌ని పేర్కొన్న విషయం తెలిసిందే. అది వాస్తవమంటూ కనేరియా కూడా అంగీక‌రించాడు. అయితే అఫ్రిది గతంలోనూ ఇలాంటి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు.

Next Story