ముఖ్యాంశాలు

  • ఆరాఫత్‌ సన్నీపై దాడి
  • గ‌తంలోనూ నిషేదం

మైదానంలో తోటి క్రికెటర్‌పై దాడికి పాల్పడ్డ‌ బంగ్లాదేశ్ క్రికెటర్‌ షహదాత్‌ హుస్సేన్‌ ఏడాది పాటు నిషేదానికి గుర‌య్యాడు. బంగ్లా దేశ‌వాళీ క్రికెట్‌ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్‌-ఖుల్నా డివిజన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్ ఈ దాడికి పాల్పడ్డాడ్డు. బంతిని ఒకవైపే షైన్‌ చేయొద్దంటూ సహచర ఆటగాడు ఆరాఫత్‌ సన్నీ చెప్పడంతో ఆగ్రహానికి గురైన షహదాత్‌ దాడికి దిగాడు. ఫీల్డ్‌లో అంతా చూస్తుండగానే ఎందుకు షైన్‌ చేయకూడదంటూ ఆరాఫత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన తోటి ఆటగాళ్లు అక్కడకి వచ్చి కొట్లాటను అడ్డుకున్నారు.

దీనిపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)సీరియస్‌ అయ్యింది. జట్టులోని సహచర ఆటగాడిగాపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఏడాదిపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. లెవల్‌ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగా షహదాత్‌పై 12 నెలలు నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది.

ఇదిలావుంటే.. బంగ్లా తరఫున 38 టెస్టులు ఆడిన షహదాత్‌ 72 వికెట్లు తీశాడు. 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు. అంత‌కుముందు 2015లో కూడా షహదాత్‌పై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. భార్యను వేధించిన కేసులో షహదాత్‌ ఇరుక్కోవడంతో అతనిపై నిషేధం పడింది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.