క్రీడాకారిణులతో 'ఆటాడుకుంటున్న' కోచ్‌లు.. లైంగిక వేధింపులపై చర్యలు శూన్యం

By Newsmeter.Network  Published on  16 Jan 2020 6:15 AM GMT
క్రీడాకారిణులతో ఆటాడుకుంటున్న కోచ్‌లు.. లైంగిక వేధింపులపై చర్యలు శూన్యం

మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధింపులు తప్పడంలేదు. దిశ, నిర్బయ వంటివి ఎంత సంచలనం సృష్టిస్తున్నా క్రీడారంగంలో మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం తప్పడం లేదు. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం గత పదేళ్లలో దేశంలోని ప్రభుత్వ రంగ క్రీడా సంస్థల్లో కనీసం 45 మంది మహిళా క్రీడాకారిణులు లైంగిక వేధింపుల బారిన పడ్డారు. ఇవి కేవలం ఫిర్యాదుల రూపంలో వెలుగు చూసినవి. అసలు బయటికే రాకుండా ఉన్న సంఘటనలు ఇంకెన్నో. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ 45 కేసుల్లో 29 కేసులు కోచ్ ల మీదే ఉన్నాయి. కోచ్ క్రీడాకారిణికి తండ్రి వంటి వాడు. వారే ఈ లైంగిక వేధింపులకు పాల్పడటం దురదృష్టకరం.

ఉదాహరణకు 2014 జనవరిలో హర్యాణాలోని హిసార్ లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రెయినింగ్ సెంటర్ లో కోచ్ ప్రపంచ ముద్దుల దినం సందర్భంగా బాలికలను ముద్దు పెట్టుకోవడం, ఇబ్బందికరమైన ప్రదేశాల్లో తడమటం, స్పర్శించడం వంటివి చేశాడు. అయిదుగురు బాలికలు దీనిపై ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పంచాయతీ ఒత్తిడితో కోచ్ పై ఫిర్యాదును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. మూడేళ్ల తరువాత స్పోర్ట్ అథారిటీ లైంగిక వేధింపుల నివారణ కమిటీ తన నివేదికలో సదరు కోచ్ ని రిటైర్ చేయాలని ఆదేశించింది. ఆయనకు ఒక ఏడాది పాటు పెన్షన్ లో పది వాతం కోత మాత్రం విధించింది. ఆ కోచ్ పై మహిళల పట్ల దుర్వ్యవహారం చేసిన అనేకానేక కేసులు ఉన్నాయి. కానీ ఆ ఫిర్యాదులపై దర్యాప్తు ఏళ్ల పాటు ఏ ఫలితమూ లేకుండా కొనసాగింది.

చాలా సందర్బాల్లో క్రీడాకారిణులు అతి పేద కుటుంబాల నుంచి వస్తారు. కాబట్టి వారు తమ కెరీర్ పోతుందన్న భయంతోనో, అల్లరి చేస్తే అభాసుపాలవుతామన్న భయంతో నోరెత్తకుండా ఉంటారు. కోచ్ లను ఎదిరిస్తే భవిష్యత్తు ఉండదన్న భయంతో నోరు మూసుకుని సహిస్తారు.

ఈ గణాంకాలను పరిశీలించండి. 2010 నుంచి 2019 వరకూ నమోదైన కేసులు 45. ఫిర్యాదులు 24 కేంద్రాలనుంచి వచ్చాయి. ఇందులో 29 కేసులు కోచ్ లపైనే పెట్టడం జరిగింది. వీరిలో అయిదుగురు కోచ్ ల జీతం తగ్గించి వదిలివేశారు. ఇద్దరు కోచ్ ల కాంట్రాక్టులను రద్దు చేశారు. ఒక కోచ్ ని సస్పెండ్ చేశారు. ఒక్క కోచ్ ఆరోపణలు వచ్చిన తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Next Story