యువతులే టార్గెట్.. మంచి వేతనమంటూ..

By అంజి  Published on  22 March 2020 1:07 PM GMT
యువతులే టార్గెట్.. మంచి వేతనమంటూ..

మంచి ఉద్యోగం.. వేలల్లో జీతం.. దెబ్బకు లైఫ్‌ సెటిల్‌ ఇలాంటి మాయ మాటలకు ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు. ఉద్యోగం పేరుతో కొన్ని కన్సలెన్సీలు అరచకాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామంటూ అమ్మాయిలను మోసం చేసి వ్యభిచార రోంపిలోకి దింపుతున్నారు. పేద, మధ్య తరగతుల అమ్మాయిలు ఉద్యోగ వేటలో ఇలా కొన్ని ముఠాలకు లొంగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో అమ్మాయిలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతున్న ముఠాను పుణే పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పోలీసులు కథనం ప్రకారం.. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు చదువుకున్న, అందమైన అమ్మాయిలు కావాలని ఓ కన్సల్టెన్సీ సంస్థ వార్త పేపర్‌లలో ప్రకటన ఇచ్చింది. ఈ మధ్య కాలంలోనే మన్విత (పేరు మార్చాం) అనే యువతి చదువు పూర్తి చేసుకుంది. మన్విత పేదింటి అమ్మాయి. పేపర్‌లో వచ్చిన ప్రకటనను చూసి వెంటనే కన్సల్టెన్సీని ఆశ్రయించింది. తప్పకుండా ఉద్యోగం ఇస్తామని, తాము పుణేలోని పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలతో కలిసి పని చేస్తున్నామని నిర్వహకులు ఆమెకు చెప్పారు. అయితే తాము ఏది చెప్పినా కాదనకుండా చేయాలని మన్వితకు షరతు పెట్టారు.

మొదట్లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల దగ్గర పని చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత అక్కడ పనితనం ఆధారంగా మంచి ఉద్యోగం ఇస్తామని మన్వితకు మాయమాటలు చెప్పారు. అయితే ఇందుకు కొంచెం పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాలని చెప్పారు. దీంతో తాను అంత డబ్బు ఇవ్వలేనని మన్విత చెప్పేసింది. తమకు తెలిసిన డేటింగ్‌ సంస్థ ఉందని.. అందులో డేటింగ్‌ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని, అప్పుడు ఈ ఫీజు కట్టేయవచ్చని మన్వితకు ఆ కన్సల్టెన్సీ నిర్వాహకులు పాడు సలహా ఇచ్చారు.

మన్వితకు అప్పటికే కన్సల్టెన్సీ నిర్వాహకులపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌ ప్రకారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాల పేరుతో అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపుతున్నామని నిందితులు విచారణలో చెప్పారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు వీరి ఉచ్చులో చిక్కుకొని వ్యభిచార కుపంలో మగ్గుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story
Share it