ముఖ్యాంశాలు

  • అర్ధ‌రాత్రి స‌మ‌యంలో స‌స్పెండ్ ఉత్త‌ర్వులు

  • చంద్ర‌బాబు హ‌యాంలో ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా..

ఏపీ జ‌గ‌న్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌త‌ చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇంట‌లిజెన్స్ చీఫ్‌గా పని చేసిన డీజీపీ స్థాయి సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును సస్పెండ్ చేస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, అడిష‌న‌ల్ డీజీగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో సెక్యూరిటీ ప‌రిక‌రాలు కొనుగోలు విష‌యంలో అవ‌క‌తవ‌క‌లు జ‌ర‌గ‌డ‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. కాగా, ఎలాంటి అనుమ‌తులు లేకుండా వెంక‌టేశ్వ‌ర‌రావు విజ‌య‌వాడ‌ను వ‌దిలి వెళ్ల‌కూడ‌ద‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఈ మేర‌కు శ‌నివారం అర్ధ‌రాత్రి స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్ జారీ చేసింది. ప్ర‌స్తుతం డీజీ హోదాలో కొన‌సాగుతున్న వెంక‌టేశ్వ‌ర‌రావు చంద్ర‌బాబు హ‌యాంలో ఇంట‌లిజెన్స్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

వెంక‌టేశ్వ‌ర‌రావుపై గ‌తంలో ఫిర్యాదు

1989వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెంద‌ని ఏబీ వెంక‌టేశ్వ‌రావు.. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో ఇంట‌లిజెన్స్ ఏడీజీగా, ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. కాగా, వెంక‌టేశ్వరరావును స‌స్పెండ్ చేయ‌డానికి గ‌ల కార‌ణాలను వివ‌రించింది. పోలీసుల కోసం కొనుగోలు చేసిన సాంకేతిక ప‌రిక‌క‌రాల‌లో నాసిర‌క‌క‌మైన‌విగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిక‌రాలు వాడితే పోలీసు సిబ్బంది ప్రాణాల‌కు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయ‌ని పేర్కొంది. చంద్ర‌బాబు హ‌యాంలో కీల‌క ప‌దవులు చేప‌ట్టిన వెంక‌టేశ్వ‌ర‌రావు.. చంద్ర‌బాబుకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ గ‌తంలో వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు ఇంట‌లిజెన్స్ చీఫ్ నుంచి ఎన్నిక‌ల సంఘం త‌ప్పించింది. కాగా, ఈ విష‌యంలో ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యంపై అప్ప‌ట్లో చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల త‌ర్వాత జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ముందుగా వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌దిలీ చేస్తూ.. పోస్టింగ్ ఇవ్వ‌కుండా కొన్ని రోజులుగా వెయింటింగ్‌లో పెట్టింది జ‌గ‌న్ స‌ర్కార్‌.

దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని..

ఇంట‌లిజెన్స్ ర‌హ‌స్యాల‌ను, వ్య‌వ‌హారాల‌ను ఫార‌న్ డిఫెన్స్ కంపెనీల‌కు ప‌లు విలువైన స‌మాచారం అందించ‌డం వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని ప్ర‌భుత్వం ఆధారాల‌తో స‌హా గుర్తించింది. అలాగే సీనియ‌ర్ పోలీసు అధికారుల సూచ‌న‌లు పాటించ‌కుండా సొంత ప్ర‌యోజ‌నాల కోసం బేఖాత‌ర్ చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది. ఇంట‌లిజెన్స్ శాఖ ద్వారా పిలిచిన టెంట‌ర్ల‌లో కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. కీల‌క టెండ‌ర్ల‌ను అర్హ‌త లేని, సాంకేతిక ప‌రిజ్ఞానం లేని కంపెనీల‌కు మేలు జ‌రిగే విధంగా వెంక‌టేశ్వ‌ర‌రు వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించిన‌ట్లు తెలుస్తోంది.

స‌స్పెన్ష‌న్‌పై స్పందించి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు

జ‌గ‌న్ స‌ర్కార్ స‌స్పెన్ష‌న్ చేస్తూ శ‌నివారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంపై డీజీ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్పందించారు. అక్రమాల కారణంగా నాపై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌డం, చ‌ర్య‌లు తీసుకోవ‌డం అనేది అవాస్త‌వ‌మ‌ని, మానసికంగా ఈ చర్యతో నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని అన్నారు. మిత్రులు, బంధువులు న‌న్ను సస్పెన్షన్ చేశార‌న్న దానిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకు వెళ్తాను.. అని ఏబీ వెంకటేశ్వరావు అన్నారు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యం మున్ముందు తెలుస్తుంద‌న్నారు.

Latter

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.