ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు అల్లుడు చంద్రబాబు నాయుడును లక్ష్మీపార్వతి పెట్టిన అక్రమాస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని.. ఆదాయానికి మించిన ఆస్తులు అతడు కలిగి ఉన్నాడని గతంలో వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబుకు ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించారు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు ఆస్తులకు సంబంధించి కేసు కూడా నమోదు కాకముందే హైకోర్టు నుంచి స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే వివరాలు పరిశీలిస్తామన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 14వ తేదీకి వాయిదా వేసింది. మొదట ఎమ్మెల్యే అయిన సమయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న జీతం 300 రూపాయలేనని అలాంటిది కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

లక్ష్మీపార్వతి తరఫున సీనియర్‌ న్యాయవాది కోకా శ్రీనివాస్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు నాయుడు స్టే ఆర్డర్ ద్వారా కేసులో వాదనలు జరగకుండా తప్పించుకున్నారని ఇప్పటికే పలువురు విమర్శించారు. కేసులపై స్టే ఆర్డర్లను ఆరు నెలలకు పరిమితం చేస్తూ సుదీర్ఘ కాలంగా  ఉన్న స్టే ఆర్డర్లను ఎత్తేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో చంద్రబాబుకు ఇచ్చిన స్టే ఆర్డర్ ను వెకేట్ చేసింది.

గతంలో చంద్రబాబు నాయుడు తనకు ‘ఎన్టీఆర్ కట్నంగా ఏమీ ఇవ్వలేదని.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు’ చంద్రబాబు ఎన్నికల సమయంలో అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో కోకా శ్రీనివాస్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉందని.. హెరిటేజ్‌ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారనీ.. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు లక్ష్మీ పార్వతి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.