విరాట్‌ కోహ్లికి సెహ్వాగ్‌ మద్దతు.. ఆర్‌సీబీ ఓట‌మికి కార‌ణ‌మ‌దే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2020 2:29 AM GMT
విరాట్‌ కోహ్లికి సెహ్వాగ్‌ మద్దతు.. ఆర్‌సీబీ ఓట‌మికి కార‌ణ‌మ‌దే

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజ‌న్‌లో అయినా టైటిల్ సాధించాల‌ని భావించిన కోహ్లీసేన‌కు నిరాశే ఎదురైంది. స‌న్ రైజ‌ర్స్‌తో జ‌రిగిన ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్ బెంగ‌ళూరు ప‌రాజ‌యం చెంద‌డంతో టోర్నీ నించి నిష్ర్క‌మించింది. ఎనిమిదేళ్ల నుంచి కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నా కూడా.. ఆ జ‌ట్టు ఒక్క‌సారి కూడా టైటిల్ నెగ్గ‌లేదు.

దీంతో కెప్టెన్ కోహ్లీపై విమ‌ర్శ‌ల తాకిడి ఎక్కువైంది. విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ లీగ్‌లో విజేతగా నిలవలేదని, విరాట్ టీమిండియాకు కూడా పెద్ద కప్పులు సాధించలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు. బెంగ‌ళూరు కెప్టెన్‌గా కోహ్లీని త‌ప్పించ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని మాజీ క్రికెట‌ర్ గంభీర్ సైతం అభిప్రాయ‌ప‌డ్డాడు.

అయితే.. గంభీర్‌ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విభేదించాడు. కోహ్లిని కెప్టెన్‌గా మార్చాల్సిన అవసరం లేదన్నాడు. అతని జట్టుకు సారథిగా మాత్రమే ఉన్నాడని.. ఇక్కడ ఫలితాలు రాకపోవడానికి ఆర్సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదని తెలిపాడు. 'టీమిండియాకు కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. మరి ఇక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లి నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు మెరుగైన విజయాలు నమోదు చేస్తుంది.

మరి ఆర్సీబీ ఎందుకు సాధించడం లేదంటే ఓవరాల్‌గా ఆ జట్టే బాలేదు. ఆర్సీబీలో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్‌ లైనప్‌ కన్పించలేదు. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరి స్థానాలను మార్చుకుంటూ కింది వరుసలో ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేశారు. కానీ అలా ఎప్పుడూ సాధ్యం కాదు. ఆర్సీబీకి ఒక స్పెషలిస్టు ఓపెనర్‌ కావాలి. అదే సమయంలో లోయర్‌ ఆర్డర్‌లో ఒక మంచి బ్యాట్స్‌మన్‌ ఉండాలని' సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

Next Story