ఇంటిపై మిడతల దాడి.. వీడియో షేర్ చేసిన సెహ్వాగ్
By తోట వంశీ కుమార్ Published on 27 Jun 2020 4:13 PM ISTఓ వైపు దేశం మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతుంటే మిడతల రూపంలో మరో కొత్త సమస్య వచ్చింది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న మిడతల దండు దాడి మళ్లీ మొదలైంది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీపై మిడతల దండు దాడి చేసింది. రాజస్థాన్ మీదుగా దేశంలోకి ఎంటర్ అయిన మిడతలు ఇప్పుడు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. గురుగ్రామ్‌లో మొదలైన ఈ మిడతల దండు దాడి మెళ్లిగా ఢిల్లీలోకి వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనను వ్యక్తం చేశారు.
మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటిపై మిడతలు దాడి చేశాయి. గురుగ్రామ్‌లో ఉన్న అతడి ఇంటిని మిడతలు చుట్టు ముట్టాయి. దానికి సంబంధించిన ఓ వీడియోను సెహ్వాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. మిడతలు దాడి చేశాయి.. మా ఇంటిపై అంటూ ఆ వీడియోకు కింద రాసుకొచ్చాడు వీరూ. ఇదిలా ఉంటే.. పంటలను నాశనం చేసే మిడతల దండు గురుగ్రామ్ సిటీతో పాటు సైబర్ హబ్ ప్రాంతమైన డిఎల్‌ఎఫ్ ఫేజ్ I-IV, చక్కర్‌పూర్, సికందర్‌పూర్, సుఖ్రాలి ఏరియాలో మిడతలు దాడి చేసే అవకశాం ఉందని, జాగ్రత్తగా ఉండాలని శుక్రవారం సాయంత్రమే అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
కరోనా మహమ్మారి కారణంగా క్రీడలన్ని వాయిదా పడ్డాయి. ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించిన కార్యకలాపాలు ఏమీ లేకపోవడంతో వీరేంద్ర సెహ్వగ్ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారు.