ధోనికి ఇంకా జట్టులో చోటుందా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2020 9:57 AM GMT
ధోనికి ఇంకా జట్టులో చోటుందా..?

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ప్రస్తుత జట్టులో చోటు లేదని అభిప్రాయపడ్డాడు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. ప్రస్తుతం రిషబ్‌పంత్, కేఎల్‌ రాహుల్‌ వికెట్ కీపింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తున్నారని తెలిపాడు.

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి టీమ్‌లో ప్రస్తుతానికి చోటు లేదని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి ధోనీ దూరంగా ఉంటుండగా.. భారత సెలక్టర్లు అతని స్థానంలో వరుసగా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి వికెట్ కీపర్లుగా అవకాశాలిస్తున్నారు. ఈ ఇద్దరిలో రిషబ్ పంత్ ఫెయిలైనప్పటికీ.. కేఎల్ రాహుల్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. దీంతో.. టీమ్‌లోకి ధోనీ పునరాగమనం కష్టమేనని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

'టీమిండియాలో ధోనీ ఏ స్థానంలో సెట్‌ అవుతాడు..? ఇప్పటికే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ మెరుగైన ప్రదర్శనతో రేసులో ముందున్నారు. ఇకపై కూడా ఇద్దరూ రాణించే అవకాశం ఉంది. రాహుల్, పంత్‌కి మద్దతుగా నిలవకుండా ఉండేందుకు టీమ్‌ఇండియా వద్ద కూడా ప్రస్తుతానికి ఎలాంటి కారణాలు లేవు’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. కివీస్‌ పర్యటనలో విఫలమైన కెప్టెన్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. విరాట్‌ అద్భుతమైన ఆటగాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌ టెండ్కూలర్‌, రికీపాంటింగ్‌ లు కూడా గడ్డుకాలం ఎదుర్కొన్నారన్నారు. విరాట్‌ కూడా త్వరంలోనే ఫామ్‌ అందుకుంటాడని సెహ్వాగ్‌ తెలిపాడు.

2019 వన్డే ప్రపంచ కప్‌ తరువాత నుంచి మహేంద్రుడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ధోని రిటైర్‌మెంట్‌ అవుతున్నాడంటూ ఊహాగానాలు వినిపించాయి. బీసీసీఐ సైతం అతని కాంట్రాక్టును పునరుద్దరించలేదు. దీంతో ధోని క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. వీటిపై బీసీసీఐ, రవిశాస్త్రి, కెప్టెన్‌ కోహ్లిలు వివరణ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో సత్తా చాటితే.. టీ20 ప్రపంచకప్‌ జట్టుకు పరిశీలిస్తామని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌ వాయిదా పడింది. అప్పటికి పరిస్థితులు మెరుగవ్వకపోతే.. టోర్నీని రద్దు చేసే అవకాశం ఉంది. దీంతో మహి రీఎంట్రీ కష్టమే.

Next Story