'థ్రెడ్స్‌'పై దావా వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్‌.. ఎందుకో తెలుసా?

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు.. ఇప్పుడు థ్రెడ్స్‌ రూపంలో మరో కొత్త తలనొప్పి మొదలైంది.

By అంజి  Published on  7 July 2023 1:43 PM IST
Twitter, legal action, Meta,Threads

'థ్రెడ్స్‌'పై దావా వేసేందుకు సిద్ధమైన ట్విట్టర్‌.. ఎందుకో తెలుసా?

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌కు.. ఇప్పుడు థ్రెడ్స్‌ రూపంలో మరో కొత్త తలనొప్పి మొదలైంది. ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ మెటా కొత్తగా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ యాప్‌కు విశేష జనాదరణ లభిస్తోంది. ప్రారంభమైన ఒక్క రోజులోనే.. ఆ యాప్‌ యూజర్ల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. అయితే యాప్‌ ప్రారంభమై ఒక్క రోజు కూడా గడవకముందే.. న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంది. మెటా తమ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌ (మేధో సంపత్తి హక్కులను) ఉల్లంఘించిందని ట్విటర్‌ ఆరోపించింది. ఇలా మోసం చేసినందుకు మెటాపై దావా వేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ న్యాయవాది అలెక్స్‌ స్పిరో.. మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌కు లెటర్‌ రాశారు.

చట్టపరంగా యజమానులకు లభించిన మేధో సంపత్తి హక్కులను అక్రమంగా వినియోగించినప్పుడు.. హక్కుల ఉల్లంఘన జరిగిందని భావిస్తారు. ఇప్పుడు ట్విట్టర్‌ కూడా ఇదే భావిస్తోంది. మెటాకు ట్విటర్‌ రాసిన లెటర్‌ను అమెరికాకు చెందిన ఓ మీడియా కంపెనీ బయటపెట్టింది. తమ ఆర్గనైజేషన్‌లో పని చేసిన ఓల్డ్‌ ఎంప్లాయిస్‌ని మెటా నియమించుకుందని, ఆపై తమ బిజినెస్‌ సీక్రెట్స్‌ని, ఇతర మేధోపరమైన అంశాలను తెలుసుకుందని ట్విటర్‌ ఆరోపించింది. చట్టానికి వ్యతిరేకంగా తమ సమాచారాన్ని వాడుకుని నకలు యాప్‌ని మెటా తయారు చేసిందని ట్విటర్‌ మండిపడింది.

''ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంశాల్లో ట్విటర్‌ రూల్స్‌ చాలా కఠినంగా ఉంటాయి. ట్విటర్‌ బిజినెస్‌ సీక్రెట్స్‌, ఇతర సీక్రెట్‌ ఇన్ఫర్మేషన్‌ని ఉపయోగించకుండా మెటా తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాం. లేదంటే దీనిపై లీగల్‌గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది'' అని అలెక్స్‌ స్పిరో ఆ లేఖలో హెచ్చరించారు. ఈ కథనంపై ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో స్పందించారు. పోటీ మంచిదే.. కానీ, మోసం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. మరోవైపు ట్విటర్‌ ఆరోపణలను మెటా ఖండించింది. ట్విటర్‌లో పని చేసిన ఉద్యోగులను ఎవరినీ తాము తీసుకోలేదని తెలిపింది. థ్రెడ్స్‌ యాప్‌ రూపకల్పన చేసిన వారిలో ట్విటర్‌ పాత ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పింది. అదంత పెద్ద విషయం కూడా కాదని మెటా అధికార ప్రతినిధి ఆండీ స్టోన్‌ థ్రెడ్స్‌లో పోస్ట్‌ చేశారు.

కాగా గురువారం నుంచి థ్రెడ్స్‌ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది.

Next Story