రేపటి నుంచే 'ట్విటర్ బ్లూ' సేవల పునరుద్ధరణ
Twitter Blue with verification arrives on Dec 12. ట్విటర్ గతంలో తీసుకొచ్చి నిలిపివేసిన ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తిరిగి పునరుద్ధరిస్తోంది.
By అంజి Published on 11 Dec 2022 6:30 AM GMTట్విటర్ గతంలో తీసుకొచ్చి నిలిపివేసిన ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తిరిగి పునరుద్ధరిస్తోంది. రేపటి నుంచి ట్విటర్ బ్లూ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 12న ధృవీకరణతో బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవను పునఃప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ఆదివారం ప్రకటించింది. దీని ధరను నెలకు ఆండ్రాయిడ్ వినియోగదారులకు 8 డాలర్లు కాగా, ఐఫోన్ యూజర్లకు 11 డాలర్లుగా నిర్ణయించింది. మస్క్ ఐఫోన్ వినియోగదారుల కోసం ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ధరను 8 డాలర్ల నుంచి 11 డాలర్లకు పెంచారు. యాపిల్ తమ ప్లేస్టోర్ నుంచి యాప్‌లకు చేసే చెల్లింపులపై 30 శాతం కోత విధిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. డబ్బులు చెల్లించిన వారు ట్విటర్‌లో బ్లూ టిక్ మార్క్‌తో పాటు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను పొందుతారు. గతంలో ప్రముఖులు, జర్నలిస్టులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఖాతాలను చెక్ చేసి బ్లూటిక్ ఇచ్చేవారు. ఇప్పుడు డబ్బులు చెల్లించిన వారికి ఈ ప్రత్యేక గుర్తింపును పొందే అవకాశం ఉంది. ''మేము సోమవారం ట్విటర్ బ్లూని మళ్లీ ప్రారంభిస్తున్నాము. బ్లూ చెక్‌మార్క్‌తో సహా సబ్‌స్క్రైబర్ ఓన్లీ ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందడానికి వెబ్‌లో 8 డాలర్లు, ఐఓఎస్‌లో 11 డాలర్లతో నెలకు సభ్యత్వం పొందండి'' అని ట్విటర్ కంపెనీ తెలిపింది.
సభ్యత్వం పొందిన వారు ఎడిట్ ట్వీట్, 1080p వీడియో అప్‌లోడ్‌లు, రీడర్ మోడ్, బ్లూ చెక్‌మార్క్ (వారి ఖాతాను సమీక్షించిన తర్వాత) పొందుతారు. బ్లూటిక్ పొందిన సబ్‌స్క్రైబర్‌లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫోటోను మార్చుకోగలుగుతారు. అయితే వారు అలా చేస్తే, వారి ఖాతాను మళ్లీ సమీక్షించే వరకు వారు బ్లూ టిక్ మార్క్‌ను తాత్కాలికంగా కోల్పోతారు అని ట్విట్టర్ తెలిపింది. మస్క్ గత నెలలో ధృవీకరణతో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించాడు. అయితే బ్రాండ్‌లు, సెలబ్రిటీలను అనుకరిస్తూ ప్లాట్‌ఫారమ్‌పై అనేక నకిలీ ఖాతాలు రావడంతో అది భారీ వివాదానికి దారితీసింది. దీంతో బ్లూటిక్‌ని వాయిదా వేసింది.