పబ్‌జీ గేమ్ కాస్తా.. బీజీఎంఐ(BGMI)గా భారత్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఈ గేమ్ ను బ్యాన్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వును అనుసరించి గూగుల్, ఆపిల్ సంస్థలు గురువారం బీజీఎంఐని తమ సంబంధిత యాప్ స్టోర్‌ల నుంచి తొలగించేశాయి. భారత ప్రభుత్వం భద్రతాపరమైన బెదిరింపులను పేర్కొంటూ 2020లో PUBG మొబైల్, అనేక ఇతర చైనీస్ యాప్‌లను నిషేధించింది. ఇప్పుడు Google, Apple సంబంధిత యాప్ స్టోర్‌ల నుండి BGMI గేమ్‌ను తీసివేయమని కోరింది.
ఇప్పుడు బ్యాటిల్ రాయల్ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో లేదు. Google, Apple రెండూ BGMIని ప్రభుత్వం కోరిన తర్వాత బ్లాక్ చేశాయి. గూగుల్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆపిల్ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. ప్రభుత్వం తమను కోరడంతో మొబైల్ గేమ్‌ను తొలగించినట్లు గూగుల్ తెలిపింది.
దేశంలో BGMI ఎందుకు బ్లాక్ చేయబడిందనే దానిపై ఎటువంటి క్లూ లేదని క్రాఫ్టన్ సంస్థ ప్రస్తుతం చెబుతోంది. గేమ్ డెవలపర్ సమస్యను పరిష్కరించడానికి, BGMIని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. "గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుండి BGMI ఎలా తీసివేశారో మాకు తెలియదు. మేము నిర్దిష్ట సమాచారాన్ని పొందిన తర్వాత మీకు తెలియజేస్తాము" అని క్రాఫ్టన్ సంస్థ చెబుతోంది. డౌన్‌లోడ్ కోసం గేమ్ ఇకపై అందుబాటులో లేనప్పటికీ, దీన్ని ఇప్పటికే వారి ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్న వినియోగదారులు దాన్ని యాక్సెస్ చేయగలరు.