ఖగోళం అద్భుతాలకు నెలవు. బుధవారం ఓ సుందరమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఈ ఏడాదిలో చివరి ఉల్కాపాతం భూమికి అత్యంత సమీపంగా రానుంది. రాత్రి 9 గంటల తరువాత ఆకాశంలో కాంతులు వెదజల్లుతూ జెమినిడ్స్ ఉల్కాపాతం జరగబోతున్నట్లు ప్లానెటరీ సొసైటీ, ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ రఘునందన్‌రావు చెప్పారు.
ఈ నెల 4 నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం ఈరోజు రాత్రికి గరిష్టస్థాయికి చేరుకోనుంది. గరిష్ఠంగా గంటకు 150 ఉల్కలతో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానున్నది. బుధవారం రాత్రి 7.47 నుంచి 11.13 మధ్యలో విజిబిలిటీ అద్భుతంగా ఉంటుంది. అయితే.. ఇది మీరు చూసే చోట ఉంటే వాతావరణం మరియు ఖగోళ పరిస్థితులతో సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
సెకనుకు 70 కిలోమీటర్ల వేగంతో జెమినిడ్స్ ఉల్కాపాతం శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే సందర్భంలో మండిపోతూ చాలా ప్రకాశంగా కనిపించనున్నాయి. వీటిని చూసేందుకు ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేదు. భూమి మీద ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వీటిని నేరుగా వీక్షించినా ఎలాంటి ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికన్ మెటియార్ సొసైటీ ప్రకారం.. డిసెంబర్ 13 రాత్రి నుంచి డిసెంబర్ 14 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. చాలా ఉల్కలు తెల్లవారుజామున 2 గంటలకు కనిపిస్తాయి.