ఆకాశంలో నేడు(బుధ‌వారం) ఓ అపురూప దృశ్యం అవిష్కృతం కానుంది. నేటి సాయంత్రం భార‌త్‌లో సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి కనువిందు చేయనున్నాయి. సూపర్‌ బ్లడ్‌ మూన్‌, చంద్రగ్రహణం ఒకేరోజున ఏర్పడమనేది సాధారణంగా ప్రతీ ఆరేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖలోకి వస్తాయి. సూర్యుడు, చంద్రుని మధ్యలోకి భూమి వస్తుంది. చంద్రుడు.. భూమికి దగ్గరగా రానుండటంతో సాధారణ రోజుల కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ క్రమంలో సూర్యకిరణాలు చంద్రునిపై పడవు. భూమి నీడ చంద్రునిపై పడుతుంది. ఈ సమయంలో కాంతి తరంగాల వల్ల చంద్రుడు ఎరుపు, నారింజ, గోధుమ రంగుల్లో కనిపించనున్నాడు. దీనినే సూపర్ మూన్‌గా పిలుస్తారు.

అయితే.. భారత‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనిని వీక్షించే అవకాశం లేదు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ గ్రహణం దర్శనిమిస్తుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్‌లో మొదలై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తుంది. కాగా.. సూప‌ర్ మూన్, చంద్ర‌గ్ర‌హ‌ణాన్ని అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, ఈక్వెడార్, పశ్చిమ పెరు, దక్షిణ చిలీ, అర్జెంటినా దేశాల్లో కనిపిస్తుంది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story