భార‌త అమ్ముల పొదిలో మ‌రో అస్త్రం.. పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Prithvi-II missile successfully test fired off Odisha coast.దేశ అమ్ముల పొదిలో మ‌రో అస్త్రం వ‌చ్చి చేరింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jan 2023 2:58 AM GMT
భార‌త అమ్ముల పొదిలో మ‌రో అస్త్రం.. పృథ్వీ-2 బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

దేశ అమ్ముల పొదిలో మ‌రో అస్త్రం వ‌చ్చి చేరింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిప‌ణి కావ‌డం విశేషం. పృథ్వీ-II క్షిపణి దాదాపు 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. మంగ‌ళ‌వారం రాత్రి ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిప‌ణిని ప‌రీక్షించారు. అత్యంత ఖ‌చ్చిత‌త్వంతో ఈ క్షిప‌ణి ల‌క్ష్యాన్ని ఛేదించిన‌ట్లు ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

"ఒక స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-II యొక్క విజయవంతమైన శిక్షణా ప్రయోగం జనవరి 10, 2023న ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి నిర్వహించబడింది. పృథ్వీ-II క్షిపణి అనే సుస్థిర వ్యవస్థ భారతదేశం యొక్క అణు నిరోధకంలో అంతర్భాగంగా ఉంది, "అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి. 350 కి.మీ.రేంజ్‌లోని లక్ష్యాలను ఛేదించ‌గ‌ల‌దు. ఈ క్షిపణి 500 కిలోల వరకు పేలు పదార్థాలను మోసుకెళ్లగలుగుతుంది. ఇది స్ట్రాప్ డౌన్ సీరియ‌ల్ నావిగేష‌న్ సిస్ట‌మ్‌పై న‌డుస్తుంది.

Next Story