ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ యూజర్లకు షాక్‌.. ఇకపై డబ్బులు చెల్లిస్తేనే..

Meta starts selling blue verified badge on Instagram and Facebook. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా.. ట్విటర్‌ బాట పట్టింది. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌

By అంజి  Published on  20 Feb 2023 2:45 PM IST
ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ యూజర్లకు షాక్‌.. ఇకపై డబ్బులు చెల్లిస్తేనే..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా.. ట్విటర్‌ బాట పట్టింది. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ పేరిట ట్విటర్‌ నెలవారీ చందా వసూలు చేస్తోంది. ట్విటర్‌ను ఆదర్శంగా తీసుకుందో.. ఏమో మెటా కూడా అదే బాట పట్టడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్ల ధ్రువీకరణ కోసం సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతోంది మెటా. ఈ విషయాన్ని మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆదివారం ప్రకటించారు. మొదట ఈ సర్వీసును న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత మెల్లగా మిగతా దేశాలకు విస్తరించనున్నారు.

అంతర్జాతీయ మాంద్యం, యాపిల్‌ ఐఓస్‌ ప్రైవసీ పాలసీ కారణంగా యాడ్స్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు 'మెటా వెరిఫైడ్‌' పేరుతో ఈ చెల్లింపు ధ్రువీకరణను తీసుకువస్తున్నారు. ప్రభుత్వ ధ్రువీకరణ ప్రకారమే అకౌంట్‌కు బ్లూ టిక్‌ కేటాయిస్తారు. ఈ సర్వీసు కోసం నెలకు వెబ్ యూజర్లు 11.99 డాలర్లు (దాదాపు రూ. 990), ఐఓఎస్ యూజర్ల బిల్లు 14.99 డాలర్లు (దాదాపు రూ. 1,240) చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లకు నకిలీల బెడద లేకుండా ఫేస్‌బుక్ అదనపు భద్రత కల్పిస్తుంది. నేరుగా కస్టమర్ కేర్‌తో సంప్రదించే ఛాన్స్‌ కూడా ఉంటుంది.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ధృవీకరించడానికి వినియోగదారులు ప్రభుత్వ ఐడీని అందించాల్సి ఉంటుందని మెటా బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. మెటా వెరిఫైడ్ ఫీచర్‌లలో వెరిఫై చేయబడిన బ్యాడ్జ్, నకిలీల నుండి మరింత రక్షణ, మెరుగైన కస్టమర్ సర్వీస్, విజిబిలిటీ, రీచ్, ప్రత్యేకమైన ఫీచర్‌లు ఉన్నాయి. అయితే మెటా దాని మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రకటనలను పరిమితం చేయదు. మెటా క్రియేటర్‌లు, బిజినెస్‌లు, దాని కమ్యూనిటీతో సహా ప్రతి ఒక్కరి కోసం విలువైన సబ్‌స్క్రిప్షన్‌ను రూపొందించాలనుకుంటున్నట్లు పేర్కొంది. పాత పద్ధతి ద్వారా ధృవీకరించబడిన వినియోగదారులు వారి ధృవీకరించబడిన బ్యాడ్జ్‌ని కలిగి ఉంటారని మెటా స్పష్టం చేస్తుంది.

Next Story