భారీ డేటా ఉల్లంఘన.. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌లు లీక్‌!

భారీ డేటా ఉల్లంఘన జరిగింది. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌లు లీక్‌ అయినట్టు ఆస్ట్రేలియా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు..

By -  అంజి
Published on : 29 Oct 2025 9:22 AM IST

Massive data breach, email passwords leaked, Gmail, Google

భారీ డేటా ఉల్లంఘన.. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌లు లీక్‌! 

భారీ డేటా ఉల్లంఘన జరిగింది. 183 మిలియన్లకుపైగా ఈమెయిల్‌ పాస్‌వర్డ్‌లు లీక్‌ అయినట్టు ఆస్ట్రేలియా సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ట్రాయ్‌ హంట్‌ ధ్రువీకరించారు. వీటిలో జీమెయిల్‌ (Gmail) ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి. మాల్‌వేర్‌ ద్వారా దొంగిలించిన లాగిన్‌ ఐడీలతో మొత్తం 3.5 టెరాబైట్ల (875 హెచ్డీ సినిమాలకు సమానం) డేటాను హ్యాకర్స్‌ రూపొందించారు. మీ ఖాతా వివరాలు లీక్‌ అయ్యాయో లేదా తనిఖీ చేసుకుని, వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని ట్రాయ్‌ సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ డేటా లీక్ సంచలనం రేపుతోంది. “Synthient LLC Stealer Log Threat Data” పేరిట బయటకు వచ్చిన ఈ లీక్‌లో 183 మిలియన్లకు పైగా ఈమెయిల్ ఖాతాల పాస్వర్డ్లు లీక్ అయ్యాయని సైబర్‌భద్రతా సంస్థలు వెల్లడించాయి. వీటిలో Gmail, Yahoo, Outlook, అలాగే ఇతర ఈమెయిల్ సేవల ఖాతాల వివరాలు కూడా ఉన్నాయి.

సైబర్ నిపుణుల ప్రకారం.. ఇది ఏదైనా ఒక కంపెనీ సర్వర్ హ్యాక్ వల్ల కాదు. “ఇన్ఫోస్టీలర్ మాల్వేర్”అనే సాఫ్ట్ ‌వేర్ ద్వారా వినియోగదారుల కంప్యూటర్లు, మొబైల్ పరికరాల నుంచి నేరుగా లాగిన్ వివరాలు దొంగిలించబడ్డాయి. ఈ మాల్వేర్ బ్రౌజర్‌లో సేవ్ చేసిన పాస్వర్డ్లు, కుకీలు, టోకెన్లు సేకరించి హ్యాకర్లకు పంపుతుంది. దీనివల్ల ప్లెయిన్‌టెక్స్ట్‌లో ఉన్న పాస్వర్డ్లు నేరుగా లీక్ కావడం సైబర్ భద్రతా నిపుణులను ఆందోళనకు గురిచేసింది.

గూగుల్‌ స్పందన

గూగుల్ అధికారుల ప్రకారం, Gmail సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయి; ఈ లీక్ వినియోగదారుల పరికరాల్లో ఉన్న మాల్వేర్‌ వల్ల జరిగిందని తెలిపారు. “మా సర్వర్‌లు హ్యాక్ కాలేదు. కానీ వినియోగదారులు తక్షణమే పాస్‌వర్డ్ మార్చి, ద్విస్థాయి ప్రమాణీకరణను (2FA) ప్రారంభించాలి” అని గూగుల్ సూచించింది.

హ్యాకర్లు లీక్ అయిన ఈ వివరాలతో ఇతర సేవల్లోనూ లాగిన్ అయ్యే అవకాశం ఉందని, మాల్వేర్ ద్వారా బ్రౌజర్ కుకీలు, టోకెన్లు కూడా దొరకడంతో 2FA కూడా బైపాస్ అయ్యే ప్రమాదం ఉందని, ఉద్యోగుల లేదా సంస్థల ఈమెయిల్ ఖాతాలు హ్యాక్ అవడం వల్ల డేటా బ్రీచ్‌లు, ఫైనాన్షియల్ మోసాలు జరగవచ్చని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story