నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1

ఇస్రో చేపట్టిన ఆదిత్య- ఎల్‌1 ప్రయోగం ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2023 12:23 PM IST
ISRO, Aditya-L1, solar Mission, sriharikota ,

నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1

సూర్యుడిపై భారత్‌ ప్రయోగాలకు తొలి అడుగు పడింది. ఇస్రో చేపట్టిన ఆదిత్య- ఎల్‌1 ప్రయోగం ఉదయం 11:50 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) తాజాగా ప్రయోగానికి వేదికైంది. రూ. 378 కోట్లతో ప్రయోగించిన ఈ మిషన్‌ను చేపట్టింది ఇస్రో. నాలుగు నెలలపాటు ప్రయాణించి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌ (ఎల్‌ 1) వద్దకు చేరుకోనుంది.

15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్‌ పాయింట్‌కు భారత్‌ ఉపగ్రహ ప్రయోగం చేపట్టడం ఇదే మొదటిసారి. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలు కలగనుంది. అయితే.. ఆదిత్య ఎల్‌-1లో 7 పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమో స్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 120 రోజుల తర్వాత ఎల్‌ 1 కక్ష్యలోకి చేరనుంది. ఇక ఆదిత్య ఎల్‌ 1 శాటిలైట్‌ లైఫ్‌ టైమ్‌ ఐదేళ్లు కాగా..ఫిబ్రవరి నెలాఖరు నుంచి రెగ్యులర్‌ డేటా అందించనుంది.

ముందుగా ఆదిత్య-ఎల్‌1ను పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ భూ దిగువ కక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత దాన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పంపుతారు. ఆదిత్య-ఎల్‌1లోని రాకెట్లను దీని కోసం ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఎల్‌1 బిందువు వైపు ఆదిత్యను నడిపిస్తారు. ఈ క్రమంలో అది భూ గురుత్వాకర్షణ ప్రభావ ప్రాంతాన్ని దాటి వెళ్తుంది. ఆ తర్వాత క్రూజ్ దశ మొదలవుతుంది. ఇలా నాలుగు నెలల ప్రయాణం తర్వాత ఉపగ్రహం ఎల్‌1 బిందువుని చేరుకుంటుంది.

Next Story