ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం.. మారనున్న మెసేజింగ్ రూల్స్
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. మే 8, 2026 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ...
By - అంజి |
ఇన్‌స్టాగ్రామ్ సంచలన నిర్ణయం.. మారనున్న మెసేజింగ్ రూల్స్
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీకి సంబంధించి ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. మే 8, 2026 తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ (E2EE) మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు మెటా సంస్థ అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్‌లో వినియోగదారుల గోప్యతను పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్, ఇకపై అందుబాటులో ఉండదు. దీనివల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో పంపే సందేశాలకు అదనపు భద్రత ఉండదు. మెటా సంస్థ ఆ చాట్‌ల కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఈ మార్పు వల్ల ప్రభావితమయ్యే వినియోగదారులు తమ పాత మెసేజ్‌లను లేదా మీడియా ఫైళ్లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కంపెనీ త్వరలో సూచనలు ఇవ్వనుంది. పాత వెర్షన్ యాప్‌ను వాడుతున్న వారు తమ సందేశాలను డౌన్‌లోడ్ చేసుకునే ముందు యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని మెటా తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. అయితే, ఇదే తరహా మార్పు మెటాకు చెందిన ఇతర మెసేజింగ్ యాప్స్ (ఉదాహరణకు ఫేస్‌బుక్ మెసెంజర్) లో కూడా జరుగుతుందా లేదా అన్న విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు.
మెటా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా ఇంటర్నెట్‌లో పెరుగుతున్న బాల లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) పట్ల ఆందోళనలే కారణమని తెలుస్తోంది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తొలగించడం ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్‌లు, కాల్‌లను స్కాన్ చేయడానికి కంపెనీకి వీలవుతుంది. దీనివల్ల వేధింపులు, గ్రూమింగ్ లేదా హానికరమైన కంటెంట్‌ను గుర్తించి అడ్డుకునే అవకాశం ఉంటుంది.
అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ మెసేజింగ్ సేవల ద్వారా జరుగుతున్న నేరాలను గుర్తించేందుకు కఠినమైన నిబంధనలను రూపొందిస్తున్నాయి. యూకేలోని ఆన్‌లైన్ సేఫ్టీ యాక్ట్ 2023 వంటి చట్టాలు, ప్రైవేట్ కమ్యూనికేషన్లలో కూడా హానికరమైన కంటెంట్‌ను గుర్తించాలని ప్లాట్‌ఫారమ్‌లను కోరుతున్నాయి. అయితే, ఈ మార్పుపై మెటా ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి కారణాలను వెల్లడించాల్సి ఉంది.