మనం గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు కొన్నిసార్లు క్యాప్చా అడుగుతుంది. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఇది ఎందుకు వస్తుంది అనేది చాలా మందికి తెలియదు. క్యాప్చా అంటే 'Completely Automated Public Turing test to tell Computers and Humans Apart' అని అర్థం. సులభంగా చెప్పాలంటే కంప్యూటర్లు, మనుషులను వేరు చేయడానికి ఇదొక పరీక్ష అన్నమాట. కేవలం క్యాప్చా ఎంటర్ చేయడం అనే కాకుండా 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్' వంటి పలు విధానాలు కూడా ఈ కోవకే చెందుతాయి. వినియోగదారుని సమాచార భద్రత, వెబ్‌సైట్ల రక్షణ కోసమే 2000వ సంవత్సరంలో ఈ పద్ధతిని తీసుకొచ్చారు.
ఇవి సర్వర్లు డౌన్ కాకుండా, వైరస్ అటాక్‌లు జరగకుండా కాపాడతాయి. క్యాప్చా ప్రక్రియను మనం పూర్తి చేస్తున్నప్పుడు మన కర్సర్ కదలికలు ఆటోమేటిక్‌గా రికార్డు అవుతాయి. మనిషి చేసే కదలికలను సూక్ష్‌మస్థాయిలో పరిశీలించడం ద్వారా వెబ్‌సైట్‌ను మనుషులే ఉపయోగిస్తున్నారని కంప్యూటర్ నిర్దారించుకుంటుంది. దీనివల్ల మన సమాచారం సురక్షితంగా ఉంటుంది. అలాగే స్పామ్, పాస్‌వర్డ్ డిక్రిప్షన్, సైబర్ దాడులు, హానికరమైన మాల్‌వేర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వెబ్‌సైట్లలో క్యాప్చా తప్పనిసరిగా ఉంటుంది.