ఉద్యోగాలు చేయలేని వారు ఇతర ఉద్యోగ అవకాశాలను అన్వేషించవచ్చని తేల్చి చెప్పింది కంపెనీ. అమెజాన్ సంస్థ అభివృద్ధికి వ్యక్తిగత సహకారం చాలా అవసరమని, ఈ నిర్ణయం సంస్థకు సంబంధించిన ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందని నమ్ముతున్నట్లు ఏడబ్ల్యూఎస్ సీఈఓ మ్యాట్ గార్మాన్ వివరించారు. పూర్తి సమయం తిరిగి రావడానికి ఇష్టపడని ఉద్యోగుల కోసం, ఇతర కంపెనీలు వారి అవసరాలకు బాగా సరిపోయే పని వాతావరణాన్ని అందించే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఇన్ పర్సన్ కొలాబోరేషన్ కారణంగానే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతకు ముందు అమెజాన్ ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయంలో పని చేస్తూ ఉండేవారు. కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఇకపై ఉద్యోగులు ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులను వారానికి రెండు లేదా మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడానికి అనుమతిస్తూ ఉండగా, అమెజాన్ ఏకంగా ఐదు రోజుల ఆదేశంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది.