గదిలోనే 'న్యూక్లియర్ రియాక్టర్'ను తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. కట్‌ చేస్తే..

సాధారణంగా పీహెచ్‌డీ విద్యార్థులకు కూడా కల గానే ఒక క్లిష్టమైన ప్రయోగాన్ని అమెరికాలోని డల్లాస్ ప్రాంతానికి చెందిన ఐడెన్...

By -  అంజి
Published on : 16 Feb 2026 1:10 PM IST

Youngest Nuclear Fusion Reactor Builder, Aiden McMillan Dallas, Nuclear Physics Prodigy, Clean Energy Solutions, STEM Inspiration for Students

గదిలోనే 'న్యూక్లియర్ రియాక్టర్'ను తయారు చేసిన 12 ఏళ్ల బాలుడు.. కట్‌ చేస్తే.. 

సాధారణంగా పీహెచ్‌డీ విద్యార్థులకు కూడా కల గానే ఒక క్లిష్టమైన ప్రయోగాన్ని అమెరికాలోని డల్లాస్ ప్రాంతానికి చెందిన ఐడెన్ మెక్‌మిలన్ అనే 12 ఏళ్ల బాలుడు నిజం చేసి చూపించాడు. ఏడో తరగతి చదువుతున్న ఈ చిన్నారి, తన ఇంటి ప్లేరూమ్‌నే ఒక ప్రయోగశాలగా మార్చి, అక్కడ ఒక పనిచేసే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ ను నిర్మించాడు. ఐడెన్ ఈ ప్రయాణం తన 8వ ఏట నుంచే మొదలైంది. అప్పటి నుంచే అతను న్యూక్లియర్ ఫిజిక్స్ (అణు భౌతిక శాస్త్రం), ఫ్యూజన్ ఎనర్జీకి సంబంధించిన క్లిష్టమైన సిద్ధాంతాలను చదవడం ప్రారంభించాడు.

వెస్ట్ డల్లాస్‌లోని 'లాంచ్‌ప్యాడ్' అనే లాభాపేక్ష లేని సంస్థ అందించిన సాంకేతిక సహకారంతో తన కలని నిజం చేసుకున్నాడు. ఈ రియాక్టర్ తయారీ అంత సులభంగా జరగలేదు. ఐడెన్ పరికరాలను ముట్టుకోకుండా కేవలం భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికే కేటాయించాడు. కొడుకు చేస్తున్న ప్రయోగం ప్రమాదకరమని మొదట అతని తల్లి భయపడినప్పటికీ, ఐడెన్ తనకున్న అవగాహనతో, తగిన రక్షణ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఆమెను ఒప్పించాడు.

న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏమిటి?

రెండు తేలికపాటి పరమాణువుల కేంద్రకాలు కలిసిపోయి ఒకే భారీ కేంద్రకంగా మారే ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఈ సమయంలో భారీ ఎత్తున శక్తి విడుదలవుతుంది. ఇది సూర్యుడిలో జరిగే ప్రక్రియ. సంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాల లాగా ఇందులో హానికరమైన వ్యర్థాలు ఉండవు, అందుకే ఇది ప్రపంచానికి భవిష్యత్తులో స్వచ్ఛమైన ఇంధన వనరుగా మారుతుంది.

ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్న తర్వాత, చివరకు రియాక్టర్ నుంచి న్యూట్రాన్లు ఉత్పత్తి అయ్యాయి. న్యూట్రాన్లు విడుదలయ్యాయి అంటే అక్కడ అణు సంలీనం జరిగిందని అర్థం. ఈ విజయంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ఐడెన్ దరఖాస్తు చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా అతను నిలిచే అవకాశం ఉంది. "నా లక్ష్యం కీర్తి కోసం కాదు, కేవలం ప్రపంచానికి అవసరమైన స్వచ్ఛమైన శక్తిని ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రమే" అని ఐడెన్ వినమ్రంగా చెబుతున్నాడు. వయస్సుతో సంబంధం లేకుండా శాస్త్రీయ ఆవిష్కరణలు చేయొచ్చని ఈ బాలుడు నిరూపించాడు.

Next Story