ఉద్యమంగా మారిన సేవ్ నల్లమల !!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Sep 2019 7:53 AM GMTతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాతాల్లో విస్తరించిన నల్లమల అడవులు ఎన్నో జీవరాసులకు ఆలవాలం. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులులతో పాటు జింకలూ, చిరుతలూ, అదవి పందులు వంటి రకరకాల జీవులు నివసిస్తున్నాయి. జీవ వైవిద్యానికి పెట్టింది పేరైన నల్లమల అడవుల్లో యురేనియం అగ్గి రాజుకుంటోంది.
నల్లమలలో యురేనియం నిక్షేపాలను గుర్తించేందుకు కేంద్రప్రభుత్వం సర్వేకు అనుమతించడంపై స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి. కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్ లో38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈమేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీశాఖ అధి కారులు, సిబ్బంది వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్ యంత్రాలు వచ్చేందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నారు.
దీనితో అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చెంచులు, స్థానికులు ఏకమవుతున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టయినా అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతినబూనుతున్నారు. యువజన, కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బృందాలుగా రోడ్లపైకి వచ్చి కాపలా కాస్తున్నారు. లారీలను, అటవీ అధికారుల వాహనాలను అడవుల్లోకి వెళ్లకుండా తిప్పిపంపుతున్నారు. అడవిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమనీ, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ నిరసనకే పరిమితమైన యురేనియం వ్యతిరేక పోరాటం, క్రమంగా ఉద్యమరూపం దాలుస్తుండడంతో అటవీ అధికారులు తలపట్టుకుంటున్నారు.
నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతు కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో తెలిపారు. భావి తరాలకు బంగారు తెలంగాణ ఇస్తామా... యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా.. అనేది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోంచించాలని ఆయన కోరారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు రాష్ట్రాల్లో ప్రజలకూ ముప్పు తప్పదని పవన్ కళ్యాణ్ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. తవ్వకాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ స్వరం వినిపించగా.. నటుడు విజయ్ దేవరకొండ కూడా స్వరం కలిపారు.
తాజాగా సినీ నటి సమంత నల్లమల యురేనియం తవ్వకాలపై స్పందించారు. నల్లమల అడవులను యురేనియం బారి నుంచి కాపాడాలని ఛేంజ్.ఆర్గ్‌లో మొదలైన ఆన్‌లైన్ పిటిషన్‌ను సమంత షేర్ చేశారు. ఈ పిటిషన్‌పై సంతకం చేశాను. మరి మీరు? అని ఆమె ట్వీట్ చేశారు. వీరితో పాటు మెగా స్టార్ చిరంజీవి, దర్శకుడు వి వి వినాయక్, రేవంత్ రెడ్డి వంటి ఎందరో సెలెబ్రిటీలు ట్విట్టర్ వేదిక గా నల్లమల ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతున్నారు.