రివ్యూ : సవారి - స్లోగా సాగే బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ !  

By Newsmeter.Network  Published on  7 Feb 2020 5:26 PM IST
రివ్యూ : సవారి - స్లోగా సాగే బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ !  

నందు హీరోగా వచ్చిన సినిమా 'సవారి'. సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కాల్వ నరసింహస్వామి ప్రొడక్షన్స్ పతాకం పై సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుడితి సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

రాజు (నందు) హైదరాబద్ లోని ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ గుర్రాన్ని (బాద్షా) తోలుకుంటుంటాడు. ఈ నేపథ్యంలో అతని లైఫ్ లోకి అనుకోకుండా భాగీ (ప్రియాంక శర్మ) రిచ్ గర్ల్ వస్తోంది. ఆ తరువాత కొన్ని సంఘటనల అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. అసలు ఎక్కడా పొంతన లేని వీరి మధ్య ఎలా ప్రేమ పుడుతుంది ? ఆ ప్రేమకు ఉన్న అడ్డంకి ఏమిటి ? అలాగే రాజుకి తన గుర్రం (బాద్షా) అంటే ఎందుకంత ఇష్టం. అయితే ఆ గుర్రానికి ఉన్న సమస్య ఏమిటి ? ఆ గుర్రానికి ఉన్న సమస్యను తీర్చడానికి రాజు ఎంత కష్టపడి డబ్బులు పోగేస్తుంటాడు ? ఈ మధ్యలో తాను ఎంతగానో ప్రేమించే బాద్షా ఎందుకు మిస్సయ్యింది? దానికి గల కారకులు ఎవరు? అసలు భాగీ రాజును ఎందుకు ప్రేమిస్తోంది ? చివరికీ వీరి ప్రేమ గెలిచిందా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

నటీనటులు

సోలో హీరోగా నటించిన నందు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా ఫ్రెష్ గా కనిపించాడు. తన అమాయకత్వంతో హీరోయిన్ తో ప్రేమలో పడే సన్నివేశాల్లో గాని, తన గుర్రం మిస్ అయినప్పుడు వచ్చే సీన్స్ లో గాని అలాగే క్లైమాక్స్ లో కూడా నందు సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. ఇక బోల్డ్ అమ్మాయిగా కనిపించిన హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కథకి ప్లాట్ పాయింట్ లాంటి క్యారెక్టర్ లో కనిపించిన గుర్రం పాత్ర కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. సవారి సీన్స్ అన్ని సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేశాయి.

అలాగే హీరోయిన్ వెంట పడే పాత్రలో నటించిన నటుడితో పాటు శాడిస్ట్ పెళ్ళికొడుకుగా నటించిన కమెడియన్ కూడా తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్వులు పూయించారు. సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్నా మెయిన్ థీమ్ బాగుంది. హీరో హీరోయిన్ల తమ ప్రేమకు సంబంధిచిన ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుకున్నే మాటలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇక విలన్ గ్యాంగ్ కూడా తమ కామెడీ టైమింగ్ తో కొన్నిచోట్ల నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు డైరెక్షన్ పరంగా పర్వాలేదనిపించినా... ఆకట్టుకునే విధంగా స్క్రిప్ట్ ను రాసుకోవడంలో మాత్రం విఫలం అయ్యారు. అలాగే సినిమాలోని మెయిన్ పాయింట్ లోనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా.. దర్శకుడు ఆ కంటెంట్ ను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. ఓవరాల్ గా సినిమా ఇంట్రస్ట్ కలిగించలేని సీన్స్ తో సాగుతూ బోర్ కొడుతోంది. దర్శకుడు స్క్రిప్ట్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయి ఉండేది. అయితే ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ప్లేను రాసుకోలేదు. ఒకరికోసం ఒకరు అనే సెన్స్ తో ఉండే హీరో హీరోయిన్ల మధ్య ఆ రేంజ్ ప్రేమ (ఒక్క క్లైమాక్స్ లో తప్ప) సినిమాలో ఎక్కడా కనిపించదు. అలాగే ఆ ప్రేమకు సరైన సంఘర్షణ కూడా లేదు. దీనికి తోడు ఉన్న ప్రేమ సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకునే విధంగా ఉండవు.

ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా చాల బాగుంది. కొన్ని ప్రేమ సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తోంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. కెమెరామెన్ మొనీష్ భూపతిరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సినిమాలోని నిర్మాతలు సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ థీమ్,

కొన్ని బోల్డ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్,

డైలాగ్స్ మరియు నందు నటన.

మైనస్ పాయింట్స్ :

కథా కథనాలు ఆసక్తి కరంగా సాగక పోవడం,

సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం,

అలాగే, సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం,

అనవసరమైన ల్యాగ్ అండ్ లవ్ సీన్స్.

చివరగా..

'నందు' హీరోగా నిలబడటానికి ఎంతో కష్టపడి చేసిన ఈ 'సవారి' జస్ట్ ఒకే దగ్గరే ఆగిపోయింది. స్లమ్ ఏరియాలో గుర్రం నడుపుకునే ఓ అమాయిక కుర్రాడు, ఓ రిచ్ క్లాస్ అమ్మాయి మధ్య సాగే ఈ ప్రేమ వ్యవహారం బాగా నాటకీయతతో పాటు సహజత్వానికి బాగా దూరంగా సాగడంతో సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. దీనికి తోడు సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, ఉన్న కంటెంట్ కూడా సరిగ్గా ఎలివేట్ అవ్వకపోవడం వంటి అంశాలు ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే కొన్ని కామెడీ సీన్స్ తో పాటు 'నందు' కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. ఓవరాల్ గా ఈ బోల్డ్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ ఎక్కువమంది ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు.

Next Story