నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ47

By అంజి  Published on  27 Nov 2019 4:59 AM GMT
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ47

శ్రీహరికోట: చంద్రయాన్‌-2తో అంతరిక్షలో తన ప్రతిభను చాటిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ఘనతను సాధించింది. ఇవాళ ఉదయం 9.28 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ47 రాకెట్‌ కార్టోశాట్-3 సహా 13 అమెరికా ఉపగ్రహాలను నింగిలో తీసుకెళ్లింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి బయలుదేరిన పీఎస్‌ఎల్వీ-సీ47 తొలిదశలో 166 సెకెన్లు, రెండో దశలో 266 సెకెన్లు, మూడో దశలో ఎనిమిది నిమిషాలు దాటుకుని చివరిదైన నాలుగో దశను విజయవంతంగా పూర్తిచేసింది. నిర్దేశిత కక్ష్యలోకి రాకెట్ చేరిన తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి నిర్దేశిత కక్ష్యలో చేరాయి. 26:50 నిమిషాల వ్యవధిలో ఈ 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. కార్టోశాట్‌-3 జీవితకాలం ఐదేళ్లు, దాని బురువు సుమారుగా 1625 కిలోలు ఉంటుంది.

సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3 నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3, 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.

Next Story