శాటిలైట్ చెప్పిన 'చెత్త' కబుర్లు..!

By సత్య ప్రియ  Published on  25 Oct 2019 12:43 PM GMT
శాటిలైట్ చెప్పిన చెత్త కబుర్లు..!

పారిశుద్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ.. నగర పులపాలక సంఘం ప్రాధమిక బాధ్యత. కానీ, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కు ఇదో పెద్ద సమస్యగా మారింది.

హైదరాబాద్‌లో సుమారు 5వేల500 నుంచి 6వేల మెట్రిక్ టన్నుల వరకూ ప్రతి రోజు చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ చెత్తనంతా 135 ఎకరాల జవహర్ డంప్ యార్డ్ కి తరలిస్తారు. జవాహర్ డంప్ యార్డ్, సుమారు 30 గ్రామాలూ, అనేక కాలనీల మధ్య ఉంది. జవాహర్ డంప్ యార్డ్ కి సంబంధించిన 14 ఉపగ్రహ చాయాచిత్రాలు పరిశీలించి చూస్తే 2003 నుంచి 2019 వరకూ ఇక్కడ జరిగిన మార్పులను మనం చూడొచ్చు.

Waste Satellite 2

2003 లో తీసిన జవాహర్ డంప్ యార్డ్ ఉపగ్రహ చాయాచిత్రం

Waste Satellite 3

2019 లో తీసిన జవాహర్ డంప్ యార్డ్ ఉపగ్రహ చాయాచిత్రం

ప్రదీప్ గౌడ్ మాచర్ల, జిఐఎస్…రిమోట్ సెన్సింగ్ ఔత్సాహికుడు, తన ట్వీట్లో, ఈ స్థలానికి సంబంధించిన 14 ఉపగ్రహ చిత్రాలను ఒక జిఫ్ రూపంలో ప్రచురించారు. ఇది చూస్తే, ఈ భారీ చెత్త కుప్ప చుట్టుపక్కల ఉన్న ఊరిజనాలను ఎలా ప్రభావితం చేస్తోందో తెలుస్తుంది.



మూలాల దగ్గరే వ్యర్ధాలను వేరు చేయాలని చెప్పే ఘన వ్యర్ధాల నిర్వహణ చట్టం, 2016 పై తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ దృష్టి సారించలేదు. హైదరాబాద్‌లో తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా ప్రతి ఇంటి వద్ద సేకరించే ప్రక్రియ జరగడం లేదు." అని అంటున్నారు మానవ హక్కుల, వినియోగదారుల రక్షణ సెల్ స్థాపకులు శ్రీ ఠాకుర్ రాజ్ కుమార్ సింగ్.

నగరంలోని ప్రతి వీధి చివర చెత్త కంపుకొడుతుంది. అయినా, ప్రభుత్వం వ్యర్ధ పదార్ధాల నిర్వహణపై ఎటువంటి చర్యా తీసుకోవడం లేదు. రూల్ ప్రకారం, చెత్త ను మూడు విభాగాలుగా వేరు చేసి చెత్త సేకరించే వారికి అందివ్వాలి.

ఇంకా..."చాలా సమయాల్లో, చెత్త వేరు చేయకుండానే దహనం చేస్తుండడం వల్ల హానికరమైన కార్బన్ పొగ గాలిలోకి వెలువడుతుంది. ఎన్నో సందర్భాల్లో ఆ చెత్తతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి జీహెచ్‌ఎంసీ మంచి ప్రణాళికలతో ముందుకు రావాలి. చివరి మెట్టులో కాకుండా, మొదటి మెట్టులోనే చెత్తను వేరు చేయాలి.." అని రాజ్‌ కుమార్‌ అంటున్నారు.

రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్న అమీన్ పూర్ వద్ద ఉన్న దీప్తిస్రీ డంప్ యార్డ్ కూడా ఇంకో జవహర్ నగర్ లాగా మారుతోంది. టన్నుల కొద్దీ వేరు చేయని వ్యర్ధాలు అక్కడ జమ అవుతున్నాయి. అమీన్ పూర్ చుట్టుపక్కల ఉన్న 16 చెరువులూ ఈ చెత్త వల్ల కలుషితం అవుతున్నాయి.

దమ్మాయిగూడా వాసులది కూడా సుమారుగా ఇదే పరిస్థితి. ఆ పరిసరాల్లో ఉన్న చెత్త కుప్పలు దోమలకు, కుక్కలకూ, పందులకూ, రోగాలకీ ఆలవాలంగా తయారయ్యాయి. అహ్మద్ గూడా, కరీంగూడా, దమ్మయిగూడా పరిసరాల్లో ఉన్న కాలనీలలో వ్యాధులని వ్యాపింపచేస్తొంది.

స్థానిక నేతలు... మాజీ సర్పంచ్ అనురాధా యాదగిరి గౌడ్, మాజీ ఎంపి, సర్పంచ్ నరేందర్ రెడ్డి..చెత్త డంపింగ్ స్థలాల యజమానులను వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. "దోమలు, కుక్కలు, పందులు ఇక్కడ స్వైర విహారం చేస్తున్నాయి. డంపింగ్ స్థలాల యజమానులు తాము సంపాదించిన డబ్బుతో అయినా వ్యర్ధాలను తొలగించి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు... అని స్థానిక నేతలు అంటున్నారు.

"వ్యర్ధ నిర్వహణ విధానాన్ని తయారు చేసి, అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రతి వార్డ్ లోనూ చెత్తను వేరు చేయాల్సి ఉంది. ప్రతి కిలో చెత్తకి రాం కీ వారికి డబ్బు అందుతోంది. అయినా ఫలితం లేదు, వారిని పోషించడానికి నగరాన్ని ముంచేస్తున్నారు" అని చెప్పారు సేవ్ అవర్ అర్బన్ లేక్స్(SOUL) హైదరాబాద్ కన్వీనర్ లుబ్నా సావంత్.

వ్యర్ధ నిర్వహణపై మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రముఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసారు. ఆ ప్రెస్ నోట్ లో "చెత్త రవాణా, డంపింగ్ వంటి అన్ని ప్రక్రియలూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి, వాటిని సవ్యమైన పద్దతిలో పెట్టాల్సిన బాధ్యత మనపైన ఉంది." అని అన్నారు.

నిర్మాణ వ్యర్ధాలను తొలగించడం కూడా కష్టమైన పనిగా పరిణమించింది. పరిమితి కంటే ఎంతో ఎక్కువగా నిర్మాణాల వ్యర్ధం హైదరాబాద్‌లో ఉందన్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

ఇండోర్, మైసూరు, సూరత్ వంటి నగరాలలో వ్యర్ధ నిర్వహణ ఎలా జరుగుతుందో పరిశీలించడానికి జీహెచ్‌ఎంసీ 8 మంది సభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీలో జిహెచ్ ఎంసీ శానిటేషన్ శాఖ స్పెషల్ ఆఫీసర్ సుజాతా గుప్తా మెంబర్ సెక్రటరీ గా ఉన్నారు.

Next Story