భారత్ పై 3 నైట్రోజన్ డై ఆక్సైడ్ హాట్ స్పాట్ లు
By రాణి Published on 6 Jan 2020 7:05 PM ISTముఖ్యాంశాలు
- భారత్ పై ఎన్ఓటూ హాట్ స్పాట్ లను గుర్తించిన ఉపగ్రహం
- భారత్ పై మొత్తం మూడు ఎన్.ఒ.టు హాట్ స్పాట్ లు
- ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 ఎన్.ఒ.టు హాట్ స్పాట్ లు
- వీటివల్ల ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల
- లంగ్ కేన్సర్ కు కూడా దారితీయొచ్చని నిపుణుల హెచ్చరిక
హైదరాబాద్ : భారతదేశంపై 2019లో నైట్రోజన్ డయాక్సైడ్ ప్రభావం ఎంతగా ఉందో చూపించే చిత్రాలను సెంటినల్ 5-పి ఉపగ్రహం విడుదల చేసింది. గ్రీన్ పీస్ ఇప్పటికే దేశంమీద ఉన్న ఎన్ఓటూ హాట్ స్పాట్స్ ని మూడింటిని గుర్తించింది. యూపీలోని సోన్ భద్ర, ఎంపిలోని సింగ్రౌలీ, ఒడిషాలోని తాల్చేర్ అంగుల్ ప్రాంతాలపై ఈ మూడు హాట్ స్పాట్స్ ఉన్నట్టుగా ఢిల్లీలోని ఎన్.సి.ఆర్ గుర్తించింది. అవిమాత్రమే కాక బెంగళూరు, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాలపైకూడా కాలుష్యం ప్రభావం విపరీంతంగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది.
నైట్రోజన్ డై ఆక్సైడ్ వల్ల వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల పి.ఎమ్ 2.5 గాలి కాలుష్యం పెరగగడమే కాకుండా ఓజోన్ పొర దెబ్బతింటుంది. గాలిలో ఎన్ఎటూ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనుషులకు ఊపిరి ఆడదు. ఉబ్బసం వ్యాధులు, ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడతాయి. దగ్గు విపరీతంగా వస్తుంది. ముక్కుకారడం లాంటి ఇతర ఇన్ఫెక్షన్లుకూడా పెరిగిపోతాయి. దీర్ఘకాలంపాటు ఎన్ఓటూ ఎక్కువగా ఉన్న గాలిని పీలిస్తే ఉబ్బసం వ్యాధులు దీర్ఘకాలం పాటు వేధించడమే కాకుండా శాశ్వతంగా వాటి బారిన పడే ప్రమాదం ఉంటుంది.
గడచిన కొద్ది సంవత్సరాలతో పోలిస్తే ఎన్ఓటూ 2019లో విపరీతంగా పెరిగిందనీ, దానివల్ల ప్రజలకు శ్వాసకోశ ఇబ్బందులు, ఇతరత్రా అనారోగ సమస్యలూ పెరుగుతున్నాయనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. వాహనాలు విపరీతంగా పెరిగిపోవడంవల్ల కర్బన ఉద్గారాలశాతం గాలిలో ఎక్కువై ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల వాతావరణంలో తీవ్రస్థాయి మార్పులుకూడా చోటు చేసుకుంటాయంటున్నారు.
వాహనాల వినియోగం పెరగడంవల్లేనంటున్న శాస్త్రవేత్తలు
నైట్రోజన్ డయాక్సైడ్ హాట్ స్పాట్స్ నేరుగా పెరుగుతున్న వాహనాల సంఖ్యను, వాటివల్ల ఉత్పన్నమవుతున్న కర్బన ఉద్గారాల శాతాన్నీ, తద్వారా పెరిగిపోతున్న గాలి, వాతావరణ కాలుష్యాన్ని సూచిస్తున్నాయని ఎమ్.జి.ఎన్.సి.ఆర్.ఇ చైర్మన్, వాతావరణ నిపుణులు డా.డబ్ల్యూ.జి. ప్రసన్నకుమార్ న్యూస్ మీటర్ తో చెప్పారు. గాలి పారుదల తక్కువగా ఉన్నచోటల్లా వాహనాలవల్ల గాలిలో కలిసిన కాలుష్యం ఒకచోటే పేరుకుపోతుందనీ, దానివల్లే హాట్ స్పాట్స్ ఉత్పన్నమవుతాయని అంటున్నారు.
2019లో ఉష్ణోగ్రతలు చాలా గణనీయమైన కనిష్ట స్థాయికి పడిపోవడంకూడా దీనివల్లనే అంటున్నారాయన. దీనివల్ల చలికాలం నిడివి పెరుగుతుందనీ, వాన కురవడానికి ముందూ, కురిసిన తర్వాతా గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుందనీ, అది మామూలుగా ఉంటే ఫర్వాలేదనీ, ఆ తేమలో కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉంటే కాలుష్యంతోకూడాని పొగమంచు ఎక్కువగా, ఎక్కువసేపు ఉంటే శ్వాస కోశ ఇబ్బందులు తప్పవనీ ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య నుంచి పూర్తి స్థాయిలో బయటపడడానికి వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం తప్ప మరో మార్గం లేనే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ లో కూడా వాహనాలు పెరగడం తద్వారా కర్బన ఉద్గారాలు పెరగడం, ఎన్.ఒ.టు విపరీతంగా పెరిగిపోవడం అత్యంత విచారకరమైన విషయం అని ఆయన చెప్పారు. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకూ, నాగోల్ నుంచి హైటెక్ సిటీవరకూ ఈ రెండు కారిడార్లూ కర్బన ఉద్గారాలను విపరీతంగా వాతావరణంలోకి చేరుస్తున్నాయని కుమార్ తెలిపారు. ఈ రెండు రూట్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుందనీ, దానివల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందనీ ఆయన చెబుతున్నారు.
మెట్రో కంపార్ట్ మెంట్లను పెంచాలి
మెట్రో రైళ్లలో కంపార్ట్ మెంట్లను పెంచగలిగితే ఈ ట్రాఫిక్ సమస్యకూ, దానివల్ల ఉత్పన్నమయ్యే వాతావరణ కాలుష్యం సమస్యకూ సరైన సమాధానం దొరకచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒక్కసారి ఈ ప్రత్యామ్నాయ మార్గాలను పటిష్ఠం చేసుకోగలిగితే వాహనాలవల్ల ఎదురయ్యే కాలుష్యాన్ని చాలామేరకు వీలైనంతగా తగ్గించుకోవచ్చని ఆయన అంటున్నారు.
హైదరాబాద్ లో మాత్రమే కాక అన్ని మెట్రోనగరాల్లోనూ ఈ సమస్య సర్వసాధారణమయ్యిందనీ ఎక్కడైనా సరే వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవడం తప్ప దీనికి మరో సమాధాన ప్రత్యేకంగా ఏమీ లేదని ఆయన అంటున్నారు. ఇదే విధంగా నైట్రోజన్ డై ఆక్సైడ్ ను పెంచుకుంటూపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
బొగ్గు మరియు బొగ్గు ఆధారిత విద్యుత్ తయారీ పరిశ్రమలవల్ల ఈ విధమైన కాలుష్యం మరింతగా పెరిగిపోతోందని ఆయన చెప్పారు. ముఖ్యంగా దేశంలో చంద్రపూర్, దుర్గాపూర్, ముండ్ర, తాల్చేర్ లాంటి నగరాలు ఈ విషయంలో తర్వాత హిట్ లిస్ట్ లో ఉన్నాయని చెబుతున్నారు.
భారతదేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యంపై గ్రీన్ పీస్ ఎయిర్ పొల్యూషన్ గ్లోబల్ ర్యాంకింగ్ రిపోర్ట్ 2019ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం భారత్ లో కనీసం 15 నుచి 20 నగరాలు పూర్తి స్థాయిలో గాలి కాలుష్యంతో, వాతావరణ కాలుష్యంతో నిండిపోయి ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే 241 నగరాలు నేషనల్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్ట్ ని ఉల్లంఘిస్తున్నట్టుగా తేలింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా మొత్తం యాభైకిపైగా ఇలాంటి ఎన్.ఒ.టు హాట్ స్పాట్ లను ఉపగ్రహం గుర్తించింది. వీటిలో పది హాట్ స్పాట్ లు చైనామీద ఉన్నాయి. యు.ఎ.ఇమీద ఎనిమిది హాట్ స్పాట్ లు ఉన్నాయి. యూరోప్ మీద నాలుగు, భారత్ మీద మూడు, అమెరికామీద, డెమొక్రెటిక్ రిపబ్లిక్ కాంగోమీద మిగతావి ఉన్నట్టుగా ఉపగ్రహచిత్రాల్లో కనిపిస్తోంది.
పి.ఎమ్ 2.5, నైట్రోజన్ డై ఆక్సైడ్, ఓత్రీ ఈ మూడూ మనుషుల ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంపాటు ఈ రకమైన కాలుష్యానికి లోనైనట్టైతే ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత పెరగడమే కాక లంగ్ కేన్సర్ కి కూడా దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంతగా ఎవరికివారుగా వాహనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని కోరుతున్నారు.