'సరిలేరు నీకెవ్వరు' రివ్యూ
By సుభాష్ Published on 11 Jan 2020 11:11 AM IST-బొమ్మ ఏవరేజ్ గానే దద్దరిల్లింది.
సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. ఇక బ్యాక్ టు బ్యాక్ రెండు వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆకట్టుకున్న మహేష్ ఈ చిత్రం ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా లేదా అనేది రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్. పాక్ చేతిలో బంధించిన పిల్లలను కాపాడటానికి తన టీమ్ తో శత్రువుల పై దాడికి వెళ్తాడు. ఈ క్రమంలో తన టీమ్ లో అజేయ్ (సత్యదేవ్) అనే సోల్జర్ గాయపడి చనిపోయే పరిస్థితులోకి వెళ్తాడు. అయితే అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి (భారతి)కి ఈ విషయం చెప్పి.. భరోసా ఇవ్వడానికి అజేయ్ కృష్ణ కర్నూల్ కు రావాల్సి వస్తుంది. ఈ మధ్యలో సంస్కృతి (రష్మికా మందన్నా) పరిచయం.. ప్రేమ అంటూ వెంటపడటం జరుగుతుంది. ఆ తరువాత జరిగిన ఊహించని సంఘటనల రీత్యా కర్నూల్ లో విజయశాంతి (భారతి)ని ఆమె పిల్లలను చంపడానికి విలన్ (ప్రకాష్ రాజ్ గ్యాంగ్) వెంట పడుతూ ఉంటారు. వాళ్ళను మహేష్ ఎలా సేవ్ చేశాడు? అసలు విజయశాంతి (భారతి) ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? చివరికి మహేష్ ఏం చేశాడు అనేది మిగతా కథ.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. దర్శకుడు అనిల్ రావిపూడి రాను రాను తన సినిమాల్లో కథను పెద్దగా కొరవడుతోంది. అది ఈ ‘సరిలేరు నీకెవ్వరు’లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వెరీ వెరీ సింపుల్ లైన్ ని కథగా తీసుకున్నారు. అందుకే క్లైమాక్స్ కి వచ్చేసరికి కథ ఏం లేక సినిమా తేలిపోయింది. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టుకొని కథనంతో మేనేజ్ చేసుకుంటూ వచ్చిన విధానం బాగుంది. అందుకే మహేష్‌బాబు హీరోయిజమే సినిమాను హైలెట్ చేసిందే కాని అనిల్ రావిపూడి కథ అండ్ ట్రీట్మెంట్ ఏవరేజ్ గా ఉన్నాయి. పైగా అనిల్ రావిపూడి తన గత సినిమాల రేంజ్ లో నవ్వించలేకపోయాడు.
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని కీలక సన్నివేశాలన్ని కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ లో పండని సీక్వెన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.
నటీనటులు :
ఈ సినిమాలో కొత్త మహేష్ ను చూడొచ్చు. కొత్త కామెడీ యాంగిల్ తో సరికొత్త బాడీ మాడ్యులేషన్ తో చాల బాగా చేశాడు. ఇక రష్మిక చిన్న పిల్లలా అనిపించింది. డ్యాన్సుల వరకు ఓకే అనిపించినా చాలా చోట్ల గ్లామర్‌తో మెప్పించలేదు. అసలు రష్మిక నుంచి పాటల్లో మినహా ఒక్క అందమైన ఫ్రేము కూడా కనపడదు. చిలిపి సీన్లలో నటించినా అవి కూడా తేలిపోయాయి. టేకింగ్ లోపం కూడా కనిపించింది. మహేశ్‌తో పాటల వరకు ఎలా ఉన్నా సీన్లలో కెమిస్ట్రీ సక్సెస్ అవ్వలేదు. మరో కీలక నటులు అయినటువంటి విజయశాంతి ఎన్నో ఏళ్ల గ్యాప్ ఇచ్చినా “బాస్ ఈజ్ బ్యాక్” అన్నట్టు లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అనేలా పెర్ఫామ్ చేసారు. అలాగే ప్రకాష్ నుంచి మరోసారి పర్ఫెక్ట్ విలనిజం ఈ చిత్రంలో మనం చూస్తాము.ట్రైన్ సీన్ లో బ్లేడ్ తో బండ్ల గణేష్ కాసేపే కనిపించినా ఆయన ట్రాక్ లో అదిరిపోయే కామెడీ లేదు. అలాగే సంగీత చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ మంచి రోల్ చేసారు.వెన్నెల కిషోర్, పోసాని, రావు రమేష్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు కీ రోల్ పోషిచారు.అలాగే మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ ఎప్పటిలానే తనదైన ఈజ్ నటన కనబర్చారు.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు నటన
విజయశాంతి ట్రాక్
ఇంటర్వెల్ బ్లాక్
ఎమోషనల్ సీన్స్
ట్రైన్ కామెడీ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం
ఉహిచగలిగే కథనం
బోరింగ్ ట్రీట్మెంట్
రష్మిక ఓవర్ యాక్టింగ్
తీర్పు :
మహేష్ - అనీల్ ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఏవరేజ్ గా అనిపిస్తుంది. అయితే అనీల్ మార్క్ కామెడీ ట్రాక్స్, మహేష్ మాస్ ఎలివేషన్ సీన్స్ వాటికి తగ్గట్టుగా దేవి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ రొటీన్ స్టోరీ మరియు ఊహించగలిగే కథనాలు మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బొమ్మ ఏవరేజ్ గానే దద్దరిల్లింది.