అటు బ‌స‌వ‌న్న‌లు..ఇటు హ‌రిదాసులు..వారికెందుకు ప్ర‌త్యేక‌త‌లు

By సుభాష్  Published on  13 Jan 2020 8:29 AM GMT
అటు బ‌స‌వ‌న్న‌లు..ఇటు హ‌రిదాసులు..వారికెందుకు ప్ర‌త్యేక‌త‌లు

ముఖ్యాంశాలు

  • డూ..డూ బ‌స‌వ‌న్న‌ల సంద‌డి

  • సంక్రాంతిలో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేకత

  • ముగ్గులు దేనికి సంకేతం

  • తెలుగు వారు ఆస్వాదించే తీరే సెప‌రేటు

సంక్రాంతిలో ఒక్కో అంశానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులో హరిదాసుదో ప్రత్యేకత. హరినామస్మరణతో సంక్రాంతికి పల్లెల్లో ఇంటింటికీ ఆయన తిరుగుతుంటే అందరూ తన్మయత్వంతో ఉండిపోతారు. మూడు నామాలు పెట్టుకుని.. నెత్తిన అక్షయపాత్ర.. చేతిలో వీణ మరో చేతితో చెక్క భజన. ప్రత్యేక వేషధారణలో ఊర్లోకి ప్రవేశించి హరిలో రంగ హరీ.. అంటూ హరినామస్మరణ తప్ప మరో మాట రాకుండా.. ఆపితే తప్ప ఆగకుండా వెళ్లిపోయే మనిషి హరిదాసు. హరినామాన్ని.. రామనామాన్ని స్మరిస్తూ సంచరించడమే వృత్తిగా ఉండేవాళ్లను హరిదాసులు అంటారు. కానీ ఇప్పుడు కేవలం సంక్రాంతికి మాత్రమే హరిదాసులు కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల సంక్రాంతి సమయంలోనూ హరిదాసులు కనిపించకపోవడం దురదృష్టకరం.

ఇంటి ముందు గొబ్బిళ్లతో..

గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండే భూమికి సంకేతం. దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తాను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు ఎలాంటి భేదాలు లేవనీ, అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే హరిదాసు తనకు తాను స్పష్టం చేసుకుంటాడు.

గతంలో హరిదాసు వచ్చాడంటే సాక్షాత్తూ శ్రీరాముడే ఊరికి వచ్చినట్టు భావించేవారు. ఇప్పుడు హరిదాసు రావడమంటే సంక్రాంతికి వచ్చిన అతిథి అయిపోయాడు. వృత్తుల ప్రకారం.. కులాలు ఏర్పడిన సమాజంలో హరిదాసులది హరినామస్మరణ కులవృత్తి. పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం కావడంతో కొందరు ఇప్పటికీ హరిదాసులుగా మిగిలినా చాలామంది హరిదాసులు హరినామస్మరణ చేయలేకపోతున్నారు. కారణం సమాజంలో వస్తున్న మార్పులే. కాలానుగుణంగా వచ్చిన పరిణామాల వలన తాము వృత్తిని వదులుకోవాల్సి వస్తుందని.. కానీ తెలుగు వారు హరిదాసును కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు హరిదాసులు.

సన్నాయితో ఒకరు.. వాయిద్యాలతో మరొకరు

గోమాత ప్రత్యేక అలంకరణతో ఊర్లోకి ప్రవేశిస్తుంది. సన్నాయితో ఒకరు.. వాయిద్యాలతో మరొకరు ఇరుపక్కలా ఉంటారు. సందడి చేస్తూ ఇంటింటికీ వస్తారు. వారే డూడూ బసవన్నలు. ఊర్లో డూ డూ బసవన్నల సందడిలేదంటే ఆ ఊర్లో సంక్రాంతి లేదన్నది అతిశయోక్తి కాదు. పండగకు నెలరోజుల ముందునుంచే డూడూ బసవన్నలు సంచారం చేస్తూ ప్రతీ ఇంటికీ వెళ్తారు. సంక్రాంతి మూడు రోజులూ అయితే డూడూ బసవన్నలను ఇంటికి పిలిపించుకుని మరీ పద్యం పాడించుకుంటారు.

బసవన్నలు ఇంటిముందుకొస్తే..

ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం. గంగిరెద్దు అలంకరణ చేయబడ్డ గోమాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా తీసుకుని వస్తుందని నమ్ముతారు. గోమాత ముఖంపైనే ఆ ముగ్గురు దేవుళ్లు ప్రత్యక్షమవుతారనీ ప్రతీతి. అంతే కాదు ఆవు ఇంటిముందు నిల్చుంటే .. ఆ నేల ధర్మబద్దమైనదని కూడా జనం విశ్వాసం. అందుకే గోవుకు చేసిన దానం ధర్మంగా పరిగణిస్తారు. డూడూ బసవన్నలకు వస్త్రాలు దానంగా ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

డూ..డూ బ‌స‌వ‌న్న‌ల సంద‌డి

అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు..!అంటూ డూడూ బసవన్నలతో సందడి అంతా ఇంతా కాదు. పద్యాలు పాడతారు. పొగడ్తలు వల్లిస్తారు. ఆవుచేత విన్యాసాలు చేయిస్తారు. ఇలా డూడూ బసవన్నలు సంక్రాంతికి ఊరూరా సందడి చేస్తారు. రాజుల కాలంలో ఊళ్లకు ఊళ్లు సైతం డూడూ బసవన్నలకు రాసిచ్చేవారంటే ఏ స్థాయిలో వారికి గౌరవం దక్కేదో ఊహించుకోవచ్చు. కానీ ఇప్పు డూడూ బసవన్నలకు ఆదరణ తగ్గుతోంది. వారిని కూడా ఒక వినోద వస్తువుగా చూసే పరిస్థితి దాపురించింది. మూడు రోజుల సంక్రాంతి పండుగలో ఒక్కో పండగను ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇళ్లల్లో సందడే సందడి కనిపిస్తుంది. సంక్రాంతి అంటేనే ఒక ప్రత్యేకమైన పండగగా జరుపుకొంటారు తెలుగువారు. ప్రతీ ఇంటా కన్నుల పండుగే కనిపిస్తోంది.

తెలుగు వారు ఆస్వాదించే తీరే సెప‌రేటు

సంక్రాంతి మొదలు ముక్కనుమ వరకు ఆ పండుగ అంతా సందడే సందడి. సంక్రాంతి పండుగను తెలుగువారు ఆస్వాదించే తీరే సెపరేటు. పల్లెల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కొత్త అల్లుళ్లకు .. కొంటె మరదళ్ల సరదాలకూ ప్రతీ ఇంట్లో అదో సందడిలా కనిపిస్తుంది. పండగలో చిన్న చితకా.. పెద్దా.. ముతక.. ఒక్కరని కాదు అందరూ సంక్రాంతిని ఆస్వాదిస్తారు. ఇక ఆడపిల్లల విషయానికొస్తే పండగంతా వారిదే. పట్టు ఓణీలతో ప్రత్యేక అలంకరణతో పండగలో సందడి చేస్తారు. ఆడపిల్లలు అలాంటి సంప్రదాయ అలంకరణలతో కనిపిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అదీ పండగ ఆనందమే అని చెప్పుకోవాలి.

ముగ్గులు దేనికి సంకేతం

రాళ్లూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల ఆకాశానికి సంకేతం. ఆ నేలపై చుక్కలు పెడుతూ ముగ్గు వేయడమంటే నక్షత్రాలను కలపడం ఖగోళంలో మార్పులకు సంకేతంగా పెద్దలు చెపుతుంటారు. ఆ ముగ్గుల్లో కేంద్రంగా సూర్యుడిని ప్రతిష్టిస్తుంటారంటారు. ఇదంతా శాస్త్రం చెబితే ముగ్గులు పెట్టడం అనేది ఆడపడచులకు అత్యంత ప్రీతి ప్రాంతంగా చూస్తారు. ఇక సంక్రాంతి ముగ్గులంటే చెప్పనక్కర్లేదు. ఆ ముగ్గులతో ఊరికే కళొస్తుంది. ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మల అలంకరణలు.. ఆడపిల్లల మధ్య తెలియకుండానే పోటీతత్వం కనిపిస్తుంది. మా ఇంటిముగ్గు బాగుంటే మహాలక్ష్మి మా ఇంటికే వస్తుందని అభిప్రాయపడతారు.

Next Story