సానియాకు ఫెడ్‌కప్ అవార్డు.. తొలి భారతీయురాలిగా రికార్డు
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 11:45 AM ISTభారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. ఫెడ్‌కప్ హార్ట్ అవార్డును గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కింది. ఆసియా- ఓసియానియా జోన్ నుంచి ఈ అవార్డు కోసం పోటీపడ్డ ఈ హైదరాబాద్ స్టార్ 60శాతానికి పైగా ఓట్లతో ఈ ఘనతను అందుకుంది. ఈ నెల 1 నుంచి 8వరకు ఆన్‌లైన్ ఓటింగ్ నిర్వహించగా.. సానియాకు 10,000 పై చిలుకు ఓట్లు వచ్చాయి. మొత్తం 16,985 మంది ఆన్‌లైన్ ద్వారా ఓటు వేయగా.. సానియాకే 60శాతానికి పైగా ఓట్లు పడ్డాయి.
'ఫెడ్ కప్ హార్ట్ అవార్డును గెలచుకున్న తొలి భారతీయురాలినైనందుకు చాలా గౌరవంగా ఉంది. ఈ అవార్డు దేశానికి, నా అభిమానులందరికి అంకితమిస్తున్నాను. ఈ అవార్డు ద్వారా లభించే నగదు బహుమతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందజేస్తానని, కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని సానియా తెలిపింది. ఈ అవార్డు గెలవడంతో సానియా 2000 డాలర్ల (రూ. లక్షా 51 వేలు) ప్రైజ్ మనీగా అందుకోనుంది. ఆసియా- ఓసియానియా జోన్ నుంచి ఈ అవార్డు కోసం సానియా మీర్జాతో ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో (ఇండోనేసియా) పోటీపడింది.
కుమారుడికి జన్మనివ్వడంతో దాదాపు రెండేళ్ల పాటు సానియా ఆటకు దూరం అయింది. నాలుగేళ్ల తర్వాత తన కుమారుడు ఇజాన్‌ను స్టాండ్స్‌లో ఉంచి మ్యాచ్ ఆడి తొలిసారి భారత్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు సానియా సాయం చేసింది.