మేడారం జాతర ఆహ్వాన పత్రిక.. పెరిగిన మటన్‌ ధరలు

By అంజి  Published on  29 Jan 2020 7:49 AM GMT
మేడారం జాతర ఆహ్వాన పత్రిక.. పెరిగిన మటన్‌ ధరలు

వరంగల్‌: మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర.. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. రెండు సంవత్సరాల కోకసారి జరిగే ఈ జాతరకు దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ జాతర కోసం ఇప్పటికే వివిధ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. భారతదేశంలో జరిగే కుంభమేళా తర్వాత ఈ జాతరకే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా కూడా మేడారానికి గుర్తింపు ఉంది. మేడారం జాతర గిరిజనుల సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

దాదాపు 900 ఏళ్ల చరిత్ర మేడారం సమ్మక సారక్క జాతరకు ఉంది. జాతర నేపథ్యంలో వివిధ ప్రముఖులను ఆహ్వానించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారు చేయించింది. పత్రికలో మేడారం జాతర చరిత్ర, గిరిజనుల సంప్రదాయాలను తెలిపే పుస్తకం, గిరిజనుల బొమ్మ, గుర్రం తల, కుంకుమభరణిలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఆహ్వానపత్రిలో అమ్మవారి పసుపు, కుంకుమ కూడా ఉన్నాయి. జాతరకు దేశంలోని ప్రముఖలు కూడా వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆహ్వాన పత్రికను తెలుగుతో పాటు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లోనూ అచ్చు వేయించారు. పత్రికలో జాతర తేదీలను, మేడారం చేరుకోవడానికి గూగుల్‌ మ్యాప్‌కు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించారు.

మరో వైపు మేడారం జాతర ఎఫెక్ట్‌తో మటన్‌ ధరలు పెరిగాయి. తలసరి మాంసం వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణం అవుతోంది. ఇప్పటి వరకూ మటన్‌ కిలో రూ.600 వరకు పలుకగా.. ఇప్పుడు అటూ ఇటూగా రూ.700 దాటింటి. బోన్‌లెస్‌ మటన్‌ అయితే ఎకంగా రూ.800 దాటింది. గ్రామీణప్రాంతాల్లోనూ మటన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. జాతర నేపథ్యంలో ప్రజలు పెద్ద మొత్తంలో గొర్రెలు, మేకలను కొనుగోలు చేస్తున్నారు. అమ్మవారి మొక్కులు తీర్చుకోవడం కోసం భక్తులు మేకలను కొనుగోలు చేయక తప్పడం లేదు.

Next Story