సల్మాన్ ఖాన్ సంచలన ట్వీట్.. సుశాంత్ ఫ్యాన్స్ శాపనార్థాలపై
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2020 10:48 AM ISTబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నెపోటిజంపై పలువురు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే కొందరు పరిశ్రమ పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాము కూడా బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదుర్కొన్నామని బాహాటంగానే చెబుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కుట్రలు, కుతంత్రాలు అంటూ బోలెడంత ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ హాట్ టాఫిక్‌గా మారిపోయాడు.
కుటుంబ లెగసీతో పైకి వచ్చిన పలువురి సోషల్ మీడియా ఖాతాలను నెటిజన్లు అన్ ఫాలో చేస్తున్నారు. కరణ్‌జోహార్, సల్మాన్ ఖాన్, ఏక్త కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా తదితరులపై విమర్శలు పెరుగుతున్నాయి. సోనాక్షి సిన్హా ఇప్పటికే ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నానంటూ ప్రకటించింది. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ స్పందించాడు.
తన అభిమానులను సుశాంత్ అభిమానులు ఉపయోగించిన భాష గురించి కానీ.. శాపనార్థాల గురించి కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని సల్మాన్ కోరాడు. ''ఎంతో అభిమానించే ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలి. నా అభిమానులంతా సుశాంత్ కుటుంబం.. అతని అభిమానుల పక్షాన నిలబడాలి'' అని సల్మాన్ ట్వీట్ చేశాడు.