జీవాతో ధోనీ బైక్ రైడ్.. వీడియో వైరల్
By తోట వంశీ కుమార్ Published on 21 April 2020 7:26 AM GMTభారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని లాక్‌డౌన్ సమయంలో తన కుటుంబంతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రాంచీలోని తన ఫామ్ హౌజ్‌లో ఉన్నాడు. ఇక ధోని ఏం చేస్తున్నాడు అన్న అప్‌డేట్ ను అతని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
నిన్న ధోనీ కాళ్లు నొక్కుతూ ఉన్న ఓ ఫొటోను షేర్ చేసిన సాక్షి. తాజాగా.. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ధోని తన బుల్లెట్ పై కుమారై జీవాను ఎక్కించుకుని షికారుకు వెళ్లాడు. ఈ వీడియోను పోస్టు చేసిన సాక్షి.. దాని కింద.. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. ఒకరు పెద్ద పిల్లవాడు కాగా.. మరొకరు చిన్నపిల్లోడు అని కామెంట్ చేసింది.
లాక్‌డౌన్ వేళ ధోని బైక్ రైడ్ ఏంటని అనుకుంటున్నారా..? ధోని బైక్‌ను నడిపింది రోడ్డుపై కాదు.. తన ఫామ్ హౌజ్‌లోనే. ఇక ధోనికి బైక్‌లంటే ఎంత పిచ్చో అందరికి తెలిసిందే. ధోని షెడ్‌లలో ఇప్పటికే చాలా రకాల బైక్‌లు ఉన్నాయి.
2019 ప్రపంచ కప్ తరువాత క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు మహేంద్రుడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సత్తా చాటి గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వాలని బావించాడు ధోని. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. కరోనా ముప్పుతో నిరవధిక వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో సత్తా చాటితేనే.. టీ20 ప్రపంచకప్‌లో ధోనీ ఉంటాడని ఇంతకు ముందు టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ధోని రీ ఎంట్రీ కష్టమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి.