ధోని రిటైర్‌మెంట్‌ను ఖండించిన సాక్షి.. కొద్దిసేపటికి ఆ ట్వీట్ డిలీట్
By తోట వంశీ కుమార్ Published on 28 May 2020 7:58 AM GMTభారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో తన పేరును లికించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. భారత్‌కు రెండు వన్డే ప్రపంచకప్ లు (2007లో టీ20, 2011లో వన్డే) అందించిన ఏకైక కెప్టెన్ గా కీర్తిగడించాడు మహీ. 2019 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని తిరిగి టీమ్ఇండియా జెర్సీ ధరించలేదు. ఇక అప్పటి నుంచి ఈ మాజీ కెప్టెన్ రిటైర్‌మెంట్‌పై చర్చ ప్రారంభమైంది.
కొందరు మాజీలు.. ధోని ఆడాలని కోరుకోగా.. మరికొందరు రిటైర్‌మెంట్ ప్రకటించాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తన రిటైర్‌మెంట్ పై ఎవ్వరు ఎమన్నాకానీ ధోని మనసులో ఏముందో ఇంత వరకు ఎవరికి తెలీదు. కనీసం ఈ విషయం పై ధోని ఎప్పుడు స్పందించలేదు. ఇక ఐపీఎల్ లో సత్తాచాటి రీ ఎంట్రీని ఘనంగా ఇవ్వాలని బావించాడని వార్తలు వినిపించాయి. అయితే.. కరోనా పుణ్యమా అని ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. బుధవారం ధోని రిటైర్‌మెంట్ తీసుకున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో అయితే #dhoniretire అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది. దీంతో ధోని అభిమానుల్లో కలవరం మొదలైంది. మహీ ఆటకు వీడ్కోలు పలికాడా అనే సందేహాం చాలా మందిలో కలిగింది. అయితే.. ఈ వార్తలను ధోని సన్నిహితులతో పాటు అతడి సతీమణీ సాక్షి సింగ్ కొట్టిపారేశారు.
‘అవన్నీ పుకార్లు. లాక్‌డౌన్ ప్రజలను పిచ్చోళ్లుగా మార్చిందని నేను అర్థం చేసుకున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సాక్షి వెంటనే ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. అప్పటికే ఈ ట్వీట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మహేంద్రుడి రిటైర్‌మెంట్ పై వస్తున్న వార్తలు చూడలేకనే ఇలా చేసిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.