ప్లీజ్‌.. శబరిమలకు రావద్దు .. ట్రావెన్‌కోర్‌ విజ్ఞప్తి

By సుభాష్
Published on : 10 March 2020 9:51 PM IST

ప్లీజ్‌.. శబరిమలకు రావద్దు .. ట్రావెన్‌కోర్‌ విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా భారత్‌లోనూ వ్యాపించిన విషయం తెలిసిందే. కేరళలో కూడా ఈ రోజు ఐదు కేసులు నమోదయ్యాయి. ఇది వరకు కూడా కరోనా కేసులు నమోదు కాగా, మెరుగైన వైద్యంతో వారు కోలుకున్నారు. ఇక తాజాగా మరో ఐదు కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ సర్కార్‌ అప్రమత్తమైంది. కరోనాపై కేబినెట్‌ సమావేశం నిర్వహించిన సీఎం పినరయి విజయన్‌ మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే సినిమా థియేటర్లు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా, ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు సైతం భక్తులకు విజ్ఞప్తి చేసింది. మార్చి 13న ఆలయం తెరుచుకోనుందని, అయితే కరోనా వైరస్‌ కారణంగా శబరిమలకు ఎవరూ కూడా రావద్దని భక్తులను కోరింది. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కారణంగా 4వేలకు పైగా మృతి చెందగా, లక్షా 16వేల మందికి వైరస్‌ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా మరణాలు చైనాలో సంభవించాయి. ఒక్క చైనాను తీసుకుంటే 3వేల 136 మంది మృతి చెందారు. ఇక మరణాలలో చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మొత్తం ఒక్క కేరళలో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story