విస్తృత ధర్మాసనానికి 'శబరిమల' వివాదం బదిలీ

By Medi Samrat
Published on : 14 Nov 2019 12:46 PM IST

విస్తృత ధర్మాసనానికి శబరిమల వివాదం బదిలీ

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ జ‌స్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తీర్పును చదువుతూ.. ఒకే మతానికి చెందిన రెండువర్గాలకు సమాన హక్కులు ఉంటాయని, మతంపై చర్చకు పిటిషనర్లు తెరతీశారని, అన్ని ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశానికి ఈ అంశం ముడిపడి ఉందన్నారు.

ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు చీఫ్ జ‌స్టిస్ ప్రకటించారు. 3:2 మెజారిటీతో సమీక్ష పిటిషన్లు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఏడుగురు న్యాయమూర్తులు గల విస్తృత ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కేసు పునఃసమీక్షకు ధర్మాసనం అంగీకరించింది.

ఇదిలావుంటే.. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు వెల్ల‌డించిన తీర్పుకు విరుద్ధంగా ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేదు. మహిళల ప్రవేశంపై స్టే విధించేందుకు కూడా ఒప్పుకోలేదు.

Next Story