ఈ నెల 13 నుంచి శబరిమల వాదనలు
By Newsmeter.Network Published on 7 Jan 2020 2:58 AM GMTముఖ్యాంశాలు
- ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసుల విచారణ
- తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనం
- ఈ నెల 13 నుంచి ధర్మాసనం రోజువారి విచారణ
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసుల విచారణకు సుప్రీంకోర్టు తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి ధర్మాసనం రోజువారి విచారణ ప్రారంభించనుంది. శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై తీవ్ర వివాదం రేగిన నేపథ్యంలో... దీనిపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెలువరించిన ఓ ప్రకటనలో మొత్తం తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం ఈ కేసులను విచారించనున్నట్టు తెలిపింది.
శబరిమల కేసులో ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు పేర్కొన్న కొన్ని మౌలిక, న్యాయపరమైన అంశాలపై విచారణ చేయనుంది. ఈ 9 మంది తో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం. శబరిమల సహా వివిధ హిందూ ఆలయాల్లోకి మహిళల ప్రవేశం, మసీదుల్లోకి మహిళల ప్రవేశ హక్కులు, పార్సీ యువతులు ఇతర మతాల యువకులను వివాహమాడడం, బోహ్రా మహిళల్లో సున్తీ మొదలైన అంశాలకు సంబంధించి రాజ్యాంగంలోని 14వ అధికరణానికి ఆర్టికల్స్ 25, 26 లకు మధ్య సంఘర్షణ ఉందా, ఒక దాని లక్ష్యాన్ని మరొకటి దెబ్బతీస్తోందా.. అన్నది ఈ 9 మంది జడ్జీల బెంచ్ విచారణ జరుపుతుంది. ఈ నెల 13 నుంచి ఈ బెంచ్ వాదనలు వింటుంది.
కేరళలోని పతనందిట్ట జిల్లాలో 800 ఏళ్లనాటి అయ్యప్పస్వామి సన్నిధిలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులు గల ఈ ధర్మాసనంలో... మహిళలపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు నలుగురు న్యాయమూర్తులు మొగ్గుచూపగా ఒకరు వ్యతిరేకించారు. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.