అయ్యప్ప దర్శనంపై కరోనా ఎఫెక్ట్‌: కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన హైలెవల్‌ కమిటీ

By సుభాష్  Published on  7 Oct 2020 9:06 AM GMT
అయ్యప్ప దర్శనంపై కరోనా ఎఫెక్ట్‌: కేరళ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసిన హైలెవల్‌ కమిటీ

అయ్యప్పస్వామి మాలాధరణ సమయం వచ్చేస్తోంది. ముందే కరోనా కాలంలో శబరిమల దర్శనం ఎలా ఉండబోతోందన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శబరిమలలో దర్శనాలు, భక్తుల రాక సహా పలు అంశాలపై హైలెవల్‌ కమిటీ కేరళ ప్రభుత్వానికి పలు కీలక సూచనలతో నివేదికను అందజేసింది. పంపా ద్వారా మాత్రమే భక్తులను అనుమతిండం, భక్తుల సంఖ్యను సాధారణ రోజుల్లో 1000, వారంతాల్లో 2000కు పరిమితం చేయడం, కోవిడ్‌ నెగిటివ్‌ పత్రాలు తప్పనిసరి చేయడం వంటి నిబంధనలపై సూచనలు చేసింది. నవంబర్‌ 16 నుంచి శబరిమలలో మండల మకరవిలక్కు యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వస్‌ మోహతా నేతృత్వంలో కమిటీ ఈ కీలక సూచనలు చేసింది.

10-60 ఏళ్ల వయసు వారికే అనుమతి

కాగా, శబరిమల యాత్ర సందర్భంగా 10 నుంచి 60 ఏళ్లు ఉన్న యాత్రికులకు మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతించాలని, 60 నుంచి 65 ఏళ్ల వయసులో ఉన్నవారు అయ్యప్పను దర్శించుకోవాలంటే ఆరోగ్య సమస్యలు లేవని పేర్కొంటూ ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుందని కమిటీ నివేదించింది. మండల పూజ, మరకవిలక్కులకు 5వేల మంది యాత్రికులను అనుమతించవచ్చని కమిటీ నివేదికలో పేర్కొంది.

అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే ఆన్‌లైన్‌ దర్శనం..

తాంత్రి, ఆలయ అధికారులతో చర్చలు జరిపిన తర్వాతే ఆన్‌లైన్‌ దర్శనంపై నిర్ణయం తీసుకుంటామని కేరళ పర్యాటక శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ మంగళవారం తెలిపారు. రెండు నెలల శబరి యాత్రను సజావుగా నిర్వహించడానికి ప్రభుత్వం కమిటీ సిఫారసులను పరిశీలిస్తోందని, త్వరలో మార్గదర్శకాలను జారీ చేస్తుందని ఆయన అన్నారు. యాత్రికులందరూ www.covid19jagratha.kerala.nic.in పోర్టల్‌లో నమోదు చేసుకుని దర్శనానికి 48 గంటల ముందు కోవిడ్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల యాత్రికులు భారీగా వస్తున్నందున ఆరోగ్యశాఖ పంపా, నీలక్కల్‌ వద్ద పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

Next Story